యువత క్రీడల్లో రాణించాలి
వాలీబాల్ ఛాంపియన్లకు ఎస్సై ఉదయ్ అభినందనలు
ధర్మపురి,(విజయక్రాంతి): ఇటీవల ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన జగిత్యాల జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలలో వెల్గటూర్ జట్టు అద్భుత ప్రదర్శనతో ఛాంపియన్‌గా నిలిచింది. ఈ అపూర్వ విజయాన్ని సాధించిన క్రీడాకారులను వెల్గటూర్ ఎస్సై ఉదయ్ కుమార్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ప్రత్యేకంగా అభినందించారు. విజేతలకు శాలువాలు కప్పి, జ్ఞాపికలను అందజేసి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఎస్సై ఉదయ్ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. క్రీడాకారులకు తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని, వారికి అండగా నిలుస్తామని భరోసా కల్పించారు. క్రీడాకారుల విజ్ఞప్తి మేరకు త్వరలోనే వారికి జెర్సీలను (క్రీడా దుస్తులను) అందజేస్తామని హామీ ఇచ్చారు. రాబోయే రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలలోనూ వెల్గటూర్ జట్టు ఇదే క్రీడాస్ఫూర్తిని కొనసాగించి గెలుపొందాలని ఆయన ఆకాంక్షించారు.






