28 July, 2026 | 3:43 PM

ప్రకృతి వ్యవసాయమే భవిష్యత్‌కు భరోసా

28-07-2026 03:02 PM

రైతులకు అవగాహన కల్పించిన కేవీకే శాస్త్రవేత్త

బోధన్,(విజయక్రాంతి): రుద్రూరులోని రైతు వేదికలో మంగళవారం నిర్వహించిన "రైతు నేస్తం" 100వ ఎపిసోడ్ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయంపై రైతులకు విస్తృత అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం (KVK) రుద్రూరు సీనియర్ శాస్త్రవేత్త మరియు హెడ్ డా.కె.ఇందుధర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అధిక మొత్తంలో రసాయన ఎరువులు, పురుగుమందులను వినియోగించడం వల్ల నేలలోని ప్రయోజనకర సూక్ష్మజీవులు నశించి భూసారం క్రమంగా తగ్గిపోతుందని అన్నారు. భూమి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రకృతి వ్యవసాయ పద్ధతులను రైతులు విస్తృతంగా అవలంబించాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా భూమి సారాన్ని పరిరక్షించడంతో పాటు, విషరహితమైన, నాణ్యమైన ఆహారాన్ని ఉత్పత్తి చేసి భావితరాలకు ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందించవచ్చని పేర్కొన్నారు. ప్రకృతి వ్యవసాయం ఖర్చులను తగ్గించడంతో పాటు రైతులకు స్థిరమైన ఆదాయాన్ని కూడా అందించే అవకాశాలు ఉన్నాయని వివరించారు.

ప్రకృతి వ్యవసాయంపై ఆసక్తి కలిగిన రైతులు తమ పరిధిలోని వ్యవసాయ శాఖ అధికారుల వద్ద పేర్లు నమోదు చేసుకుని ప్రత్యేక శిక్షణ పొందాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న శిక్షణా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రుద్రూరు మండల వ్యవసాయ అధికారి సాయికృష్ణ, వ్యవసాయ విస్తరణ అధికారి వెంకటేష్, వ్యవసాయ కళాశాల విద్యార్థినులు, స్థానిక రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.