17 March, 2026 | 4:35 AM

కాల్చు.. నేను చూసుకుంటా!

17-03-2026 01:53 AM
  1. భరోసా ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి 
  2. రితేష్ రెడ్డి లైసెన్స్ గన్‌తో ఢిల్లీ వ్యాపారి నమిత్ శర్మ కాల్పులు 
  3. ఫాంహౌస్ డ్రగ్ కేసు రిమాండ్ రిపోర్టులో విస్తుపోయే నిజాలు 
  4. అది పొలిటికల్ డ్రగ్ పార్టీ 
  5. ఎంపీ పుట్టా బుకాయింపును చిత్తుచేసిన పోలీసులు
  6. సిమ్లా నుంచి తెప్పించిన కొకైన్.. గ్రాముకు 15 వేలు 
  7. సిమ్లా టూర్‌లో కొకైన్ కొన్న అడ్వకేట్ కౌశిక్ 
  8. మద్యంలో కొకైన్ కలిపి సేవించిన వీఐపీలు

హైదరాబాద్, సిటీ బ్యూరో మార్చి 16 (విజయక్రాంతి): నగర శివారులోని విలాసవంతమైన ఫాంహౌస్‌లు డ్రగ్స్, తుపాకుల సంస్కృతికి అడ్డాగా మారాయన్న చేదు నిజం మరోసారి బట్టబయ లైంది. కేవలం విందులు, వినోదాలే కాదు.. చట్టం తమను ఏమీ చేయలేదన్న ధీమాతో ఏకంగా పోలీసులపైకే తూటా లు పేల్చే స్థాయికి కొందరు రాజకీయ, వ్యాపార ప్రముఖులు బరితెగించారు.

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ అజీజ్‌నగర్‌లోని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫాంహౌస్‌లో శనివారం అర్ధరాత్రి జరిగిన హైప్రొఫైల్ డ్రగ్స్ పార్టీని తెలంగాణ పోలీసుల ప్రత్యేక విభాగం ఈగల్ ఫోర్స్ అత్యంత చాకచక్యంగా రట్టుచేసింది. ఈ ఆపరేషన్‌లో ఏపీకి చెందిన ఎంపీ, ఒక మాజీ ఎమ్మెల్యే సహా ఆరుగురు కొకైన్ సేవించినట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ కావడం  సంచలనం కలిగించింది.

పోలీసులు దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో నిందితుల బరితెగింపు స్పష్టం గా కనిపిస్తోంది. శనివారం రాత్రి 10 గం టల సమయంలో 40 మంది పోలీసు లు ఫాంహౌస్ గోడలు దూకి లోపలికి వెళ్లగా, నిందితులు పోలీసులను భయపెట్టి పారిపోయేందుకు యత్నించారు. 

‘మీరు కాల్చేయండి.. ఏం జరిగినా నాదే బాధ్యత.. నేను చూసుకుంటాను’ అని చెప్పడంతోనే కాల్పులు జరిగినట్టు పోలీసులు రిపోర్టులో పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆదేశాలతోనే దిల్లీకి చెం దిన వ్యాపారి నమిత్ శర్మ పోలీసుల వైపు తుపాకీతో ఒక రౌండు కాల్పులు జరిపారు. అదృష్టవశాత్తు ప్రాణనష్టం తప్పగా, అప్రమత్తమైన పోలీసులు నిందితులను చుట్టుము ట్టి జర్మనీలో తయారైన .32 క్యాలిబర్ రివాల్వర్‌తో పాటు నమిత్ శర్మను అదుపులోకి తీసుకున్నారు.

ఎంపీ పుట్టాకు పాజిటివ్.. 

ఈ కేసులో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌కుమార్ వ్యవహారం చర్చనీయాం శమైం ది. తొలుత నిర్వహించిన ర్యాపిడ్ టెస్టులో ఆయనకు నెగిటివ్ రావడంతో తాను నిర్దోషిన నివాదించారు. అయితే, పోలీసులు మ రింత పక్కాగా నిర్ధారించుకోవడానికి అర్ధరాత్రి అందరినీ ఎర్రగడ్డ ఆస్పత్రికి తరలించి రక్త నమూనాలను సేకరిం చారు. ఆదివారం వెలువడిన నివేదికలో ఎంపీ పుట్టాకు పాజిటివ్ అని రావడంతో ఆయన డ్రగ్స్ తీసుకు న్నట్లు శాస్త్రీయంగా రుజువైంది. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, కౌశిక్ రవి, అర్జు న్ రెడ్డిలకు కూడా కొకైన్ పాజిటివ్ వచ్చింది.

సిమ్లా నుంచి తెప్పించిన కొకైన్..

సోదాల్లో డ్రైవర్ శరత్‌కుమార్ వద్ద 0.26 గ్రాముల కొకైన్ దొరికింది. దీని గు రించి ఆరా తీయగా.. బెంగళూరుకు చెందిన అడ్వకేట్ కౌశిక్ రవి తాను సిమ్లా బిజినెస్ ట్రిప్‌కు వెళ్లినప్పుడు, గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఒక్కో గ్రాముకు రూ. 15,000 చొప్పున చెల్లించి కొకైన్ కొన్నానని, రోహిత్ రెడ్డి ఇచ్చి న వీకెండ్ పార్టీ కోసమే దీనిని తీసుకువచ్చానని ఒప్పుకున్నాడు. వీరంతా మద్యంలో కొకైన్ కలుపు కుని తాగినట్లు విచారణలో తేలింది.

పోలీసులపై కాల్పులకు ప్రేరేపించినందుకు పైలట్ రోహిత్ రె డ్డిని ప్రధాన నిందితుడిగా చేర్చారు. ఆదివారం రాత్రి ఉప్పరపల్లి కోర్టులో ముగ్గురు ప్రధాన నిందితులను హాజరుపరచగా.. రో హిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మలకు న్యా యమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో వారిని భారీ భద్రత మధ్య చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఎంపీ పుట్టా మహేష్‌కుమార్ సహా మిగిలిన ఎనిమిది మందికి నోటీసులు ఇచ్చి పంపారు.

నిందితుల నుంచి తుపాకీతో పాటు 4 ఖాళీ తూటాలు, 48 బీర్లు, విదేశీ మద్యం సీసాలను పోలీసులు సీజ్ చేశారు. రోహిత్‌రెడ్డి ఫాంహౌస్ మరోసారి చర్చనీయాంశం కావ డం గమనార్హం. 2022లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారం కూడా ఇదే ఫాం హౌస్‌లో వెలుగుచూసింది. అప్పుడు ఫిర్యాదుదారుడిగా ఉన్న రోహిత్ రెడ్డి, ఇప్పుడు డ్రగ్స్, పోలీసులపై కాల్పుల కేసులో నిందితుడిగా అదే ఫాంహౌస్ నుంచి జైలుకు వెళ్లారు.

నిందితుల చిట్టా.. 

Fఏ1: నమిత్ శర్మ,దిల్లీ వ్యాపారి, షూటర్

Fఏ2: పైలట్ రోహిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే

Fఏ3: రితేష్ రెడ్డి, రోహిత్ సోదరుడు

Fఏ4: కౌశిక్ రవి, బెంగళూరు అడ్వకేట్, డ్రగ్స్ సప్లయర్

Fఏ5: సిల్వరి శరత్ కుమార్, డ్రైవర్

Fఏ6: తిరువీధుల అర్జున్ రెడ్డి, వ్యాపారి

Fఏ7: పుట్టా మహేష్‌కుమార్, ఏలూరు ఎంపీ

Fఏ8: నుంచి ఏ11: ఎం. రమేష్, వి. శ్రవణ్ కుమార్, ఎన్. విజయకృష్ణ, ఆర్. ప్రియాం క రెడ్డి.

F * చంచల్‌గూడ జైలుకు: ఏ1, ఏ2, ఏ3