‘ఆప్’కు షాక్
- బీజేపీలోకి ఏడుగురు ఎంపీలు
- ఆపార్టీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్‌ను కలిసిన రాఘవ్ చడ్డా
ఢిల్లీ, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చడ్డా పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. శుక్రవారం సాయంత్రం మీడియా సమావేశంలో రాజీనామా ప్రకటించిన చడ్డా, సందీప్ సింగ్, అశోక్ మిట్టల్‌తో కలిసి నేరుగా ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్‌ను కలిశారు. ఈ సందర్భంగా నితిన్ నబీన్ పార్టీలో చేరడాన్ని ఆహ్వానించారు. వారికి స్వీట్లు తినిపించారు.
ఆదర్శాలను పక్కన పెట్టినందుకే: చడ్డా
అంతకుముందు మీడియా సమావేశం లో మాట్లాడిన రాఘవ్ చడ్డా ఆమ్ ఆద్మీ పా ర్టీ ఆదర్శాలను పక్కనపెట్టిందన్నారు. దీంతో ఆ పార్టీ నుంచి దూరం వెళుతున్నానని చెప్పారు. తనతోపాటు హర్భజన్ సింగ్, రాజేంద్ర గుప్తా, స్వాతిమాలివాల్, సందీప్ పాఠక్, విక్రమ్ జిత్ సహానీ, అశోక్ మిట్టల్ ఉన్నారని ప్రకటించారు. 2/3 రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆప్‌ను బీజేపీలో విలీనం చేస్తున్నట్లు చడ్డా చెప్పారు. పార్టీకి తన రక్తం ధారపోశానన్నారు. చెమటోడ్చి పనిచేసి ఉన్నతస్థాయికి తీసుకువచ్చానని పేర్కొన్నారు.
సిద్ధాంతాలు, విలువల కోసం 15 ఏళ్లుగా పార్టీ ఉన్నతికి పాటుపడ్డానని చెప్పారు. గత కొన్నేళ్లుగా ఆ సిద్ధాంతాలు, విలువలను పార్టీ కోల్పోయిందని చెప్పారు. అందుకే ఇక పార్టీలో ఇమడలేక వేరు పడుతున్నానని, ప్రజలకు మరింత దగ్గరవుతా నని ప్రకటించారు. ఈ ప్రకటనతో ఆప్‌లో అలజడి మొదలైంది. ఆప్‌లో పదిమంది రాజ్యసభ సభ్యులుండగా వారిలో ఏడుగురు పంజాబ్, ముగ్గురు ఢిల్లీకి చెందినవారు. పార్టీని వీడిన అనంతరం సంజయ్ సింగ్, ఎన్డీ గుప్తా (ఢిల్లీ), బల్బీర్‌సింగ్ (పంజాబ్)లు మాత్రమే మిగిలారు.
పంజాబ్ సీఎం భగవంత్‌మాన్ మాట్లాడుతూ.. బీజేపీ పంజాబ్‌కు ద్రోహం చేసిం దని, శరద్ పవార్, శివసేన (యూబీటీ), కాంగ్రెస్ విషయంలో కూడా ఇదే విధానాన్ని అవలంభించారని విమర్శించారు. పంజాబ్‌లో బీజేపీకి ఎలాంటి పట్టులేకపోవడంతో ఇలాంటి దుశ్చర్యలకు దిగుతుందని మండిపడ్డారు. ఇక బీజేపీలో చేరుతున్న ఆ ఏడుగురు ఎంపీలు పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహించరని, వారు ద్రోహులని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ మాట్లాడుతూ.. పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌ను ఎదుర్కోలేక బీజేపీ ఆపరేషన్ లోటస్‌ను ప్రారంభించిందని ఆరోపించారు. పంజాబ్‌కు మంచిచేస్తుంటే బీజేపీ అడ్డుకోవడానికి చూస్తుందని విమర్శించారు.
ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ప్రజలు పంజాబ్ ప్రజలు ఎప్పటికీ క్షమించరని, పరిపాలనా యంత్రాంగ్రాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ప్రజలు ఈ విషయాన్ని, ఏడుగురు ఎంపీలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్‌లో వారికి బుద్ధి చెప్పాలన్నారు. ఆప్ అధినేత, మాజీ సీఎం కేజ్రీవాల్ సోషల్ వేదికగా స్పందించారు. పంజాబ్‌కు బీజేపీ మరోమారు ద్రోహం చేసిందన్నారు.






