భూ భారతి భూ సర్వేలో మండలంలో రెండో గ్రామంగా శేరి దామరగిద్ద
నాగలిగిద్ద,(విజయక్రాంతి): నాగలిగిద్ద మండల పరిధిలోని శేరి దామరగిద్ద గ్రామంలో భూ భారతి భూ సర్వే కార్యక్రమానికి సంబంధించి గ్రామ సభ, అవగాహన సదస్సు శనివారం నిర్వహించారు. మండలంలో భూ భారతి భూ సర్వే చేపట్టిన రెండో గ్రామంగా శేరి దామరగిద్ద గుర్తింపు పొందింది. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ (ఎంఆర్వో) సంగ్రామ్ రెడ్డి, ఎంపీడీవో మహేశ్వర రావు, ఎంఈఓ మన్మధ కిషోర్, జీపీఓ సునీత, ఆర్ఐ అనిల్ రెడ్డి, సర్వేయర్ నర్సింలు పాల్గొని భూ సర్వే ప్రక్రియ, భూ రికార్డుల సవరణ, భూముల వివరాల నమోదు విధానం గురించి గ్రామస్థులకు వివరించారు. భూ సమస్యల పరిష్కారానికి భూ భారతి కార్యక్రమం ఎంతో ఉపయోగకరమని తెలిపారు.
గ్రామ సర్పంచ్ మల్గే రాజు, ఉపసర్పంచ్ పండరి మాట్లాడుతూ గ్రామ ప్రజలు భూ సర్వే కార్యక్రమానికి పూర్తి సహకారం అందించి తమ భూముల వివరాలను సక్రమంగా నమోదు చేయించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు భూ భారతి కార్యక్రమం లక్ష్యాలు, ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ నిర్మలా, పుణ్యవతి గ్రామ ప్రజాప్రతినిధులు, రైతులు, గ్రామస్థులు, రెవెన్యూ సిబ్బంది, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. గ్రామస్థులు తమ సందేహాలను అధికారులను అడిగి నివృత్తి చేసుకున్నారు.






