16 May, 2026 | 3:01 PM

మహిళల భద్రత కోసమే షీటీం

16-05-2026 02:15 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహిళల భద్రత కోసమే షి టీం పనిచేస్తుందని, మహిళల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని షీ టీం ఎస్ఐ సునంద అన్నారు. మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ ఆదేశాల మేరకు శనివారం కురవి పోలీస్ స్టేషన్ పరిధిలోని అయ్యగారి పల్లి గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న మహిళా కార్మికులకు, గ్రామ ప్రజలకు మహబూబాబాద్ షీ టీం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో షీ టీం ఎస్ ఐ సునంద మాట్లాడుతూ మహిళల భద్రత, బహిరంగ ప్రదేశాలలో మహిళలు ఎదుర్కొనే వేధింపులు, అత్యవసర పరిస్థితుల్లో పోలీసులను ఎలా సంప్రదించాలనే అంశాలపై అవగాహన కల్పించారు. అలాగే ప్రస్తుత కాలంలో పెరుగుతున్న సైబర్ నేరాలు, ఫోన్ కాల్స్, ఓ టీ పీ మోసాలు, సోషల్ మీడియా మోసాలు, ఆన్‌లైన్ వేధింపుల నుండి ఎలా జాగ్రత్తగా ఉండాలో వివరించారు.

బాల్య వివాహాల వల్ల కలిగే చట్టపరమైన, సామాజిక సమస్యలను తెలియజేస్తూ, బాల్య వివాహాలను అరికట్టడంలో ప్రతి ఒక్కరి బాధ్యతను గుర్తు చేశారు. మహబూబాబాద్ షీ టీం నెంబర్: 8712656935, అత్యవసర నెంబర్: 100/112, సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్: 1930, మహిళ హెల్ప్ లైన్ నెంబర్: 181/1091. చైల్డ్  హెల్ప్ లైన్ నెంబర్1098 వినియోగంపై వివరించారు. ఈ కార్యక్రమంలో షీ టీం సిబ్బంది అరుణ, పార్వతి, రమేష్  పాల్గొన్నారు.