శంకర్‌గౌడ్‌ది సర్కారు హత్యే
- బాధిత కుటుంబానికి రూ.కోటి, ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలి
- ఆర్టీసీని నిర్వీర్యంచేసే కుట్రలను ఇకనైనా మానుకోవాలి
- కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి
- కాంగ్రెస్ సర్కారులో కనీసం చలనం లేకపోవడం సిగ్గుచేటు
- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, ఏప్రిల్24 (విజయక్రాంతి): వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్‌ది ఆత్మహత్య కాదని, అది ముమ్మాటికీ రేవంత్ సర్కారు చేసిన హత్యేనని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రెండున్నరేళ్లుగా సీఎం రేవం త్ ఆర్టీసీ కార్మికులకు చేస్తున్న తీరని ద్రోహా న్ని తట్టుకోలేకనే శంకర్‌గౌడ్ బలవన్మరణానికి పాల్పడ్డారని తెలిపారు. ఆర్టీసీ సంస్థ పరిరక్షణకు, తోటి కార్మికుల హక్కుల సాధనకు ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ శంకర్‌గౌడ్ పార్థివదేహాన్ని నర్సంపేట డిపో వద్దకు తీసుకెళ్లి నివాళులు అర్పించేందుకు కూడా అను మతించకపోవడం అత్యంత దుర్మార్గమైన చర్య అని శుక్రవారం ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తంచేశారు.
పుట్టెడు దుఖంలో ఉన్న శంకర్‌గౌడ్ కుటుంబసభ్యులకు అండగా నిలిచిన బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డితోపాటు పార్టీ నేతలు, ఆర్టీసీ కార్మికులు, కార్మిక సంఘాల నేతలను నర్సంపేటలో అ రెస్టు చేయడం దారుణమని మండిపడ్డారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో అక్రమంగా అరెస్టుచేసిన వారందరినీ బేషరతుగా విడుదలచేయాలని డిమాండ్‌చేశారు. కాంగ్రెస్ సర్కారు రాక్షసత్వం వల్ల కుటుంబ పెద్దను కోల్పోయి పుట్టెడు దుఖంలో ఉన్న శంకర్‌గౌడ్ కుటుంబానికి ప్రభు త్వం రూ.కోటి పరిహారం చెల్లించాలని, ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి అన్ని విధాలా ఆదుకోవాలని బీఆర్‌ఎస్ పక్షాన డిమాండ్‌చేశారు.
ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నా, కనీసం సోయి లేని సర్కారు అంతులేని నిర్లక్ష్యం వల్లే ప్రస్తుతం ఉద్యమం నాటి దృశ్యాలు, ఆత్మబలిదానాలు చేసుకునే పరిస్థితులు చూస్తున్నామన్నారు. అసెంబ్లీ ఎన్నికల వేళ సవాలక్ష హామీలిచ్చిన రేవంత్‌రెడ్డి కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా ఇప్పటి కీ నెరవేర్చకపోవడంతోనే ఆర్టీసీ కార్మిక లోకం తీవ్ర నిరాశ, నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతోందని మండిపడ్డారు. ఆర్టీసీని నిర్వీర్యం చేసే కుట్రలను ఇకనైనా మానుకుని, కార్మికులతో చర్చలు జరిపి, ఇచ్చిన హామీలను, న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని సూచించారు. రాష్ట్రంలో ఒకేరోజు ముగ్గురు ఆర్టీసీ డ్రైవర్లు ఆత్మహత్య ప్రయత్నాలు చేసిన ఘటన తెలంగాణ చరిత్రలో ఓ చీకటి రోజుగా మిగిలి ఉంటుందన్నారు.
తెలంగాణలో ఏకకాలంలో ఇన్ని బాధాకరమైన ఘటనలు జరిగినా మానవత్వంలేని కాంగ్రెస్ సర్కారులో కనీసం చలనం లేకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. ‘ఆర్టీసీ కార్మిక సోదరుల్లారా.. దయచేసి మనోధైర్యాన్ని కోల్పోకండి. మీ పోరాటాలకు బీఆర్ ఎస్ పూర్తిస్థాయిలో అండగా ఉంటుంది’ అని పిలుపునిచ్చారు. ఈ నిరంకుశ కాంగ్రెస్ సర్కారు, ఈ అసమర్థ సీఎం మెడలు వంచి ఆర్టీసీ కార్మికుల న్యాయమైన హక్కులను సాధించే వరకూ మనమంతా కలిసి సంఘటితంగా ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు.






