25 April, 2026 | 3:48 AM

శంకర్ ఆత్మహత్యకు ప్రభుత్వానిదే బాధ్యత

25-04-2026 02:26 AM
  1. మేం పబ్లిసిటీ కోసం రాలేదు 
  2. ఆర్టీసీ డిపో ఎదుట మృతదేహాన్ని కొంతసేపు ఉంచితే నష్టమేంటి?
  3. ఆత్మహత్యలు వద్దు.. సమస్యల పరిష్కారానికి కొట్లాడాలి
  4. కేంద్రమంత్రి బండి సంజయ్

మహబూబాబాద్, ఏప్రిల్ 24 (విజయక్రాంతి) : రెండు దశాబ్దాలకుపైగా ఆర్టీసీ డ్రైవ ర్‌గా విధులు నిర్వహించి, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఆత్మార్పణం చేసుకున్న డ్రైవర్ కోలా శంకర్‌గౌడ్ మృతదేహాన్ని నర్సంపేట డిపో ఎదుట కొంతసేపు ఉంచి నివాళులర్పిస్తే వచ్చే ఇబ్బంది ఏమిటి, వచ్చే కష్టం ఏమిటని కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ఆత్మార్పణ చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్ కుటుంబాన్ని బండి సంజయ్ శుక్రవా రం పరామర్శించారు.

ముత్తోజిపేటకు చేరుకున్న కేంద్రమంత్రి.. కార్మిక సంఘాల నేత లు, శంకర్‌గౌడ్ కుటుంబసభ్యుల అభిప్రాయాన్ని పోలీసులు గౌరవించాలని, శంకర్ గౌడ్ మృతదేహాన్ని ఐదు నిమిషాలపాటు నర్సంపేట ఆర్టీసీ డిపో ఎదుట ఉంచాలని డిమాండ్‌చేస్తూ ముత్తోజిపేటలో ఆందోళనకు దిగారు. శంకర్‌గౌడ్ శవపేటికను ములుగు నర్సంపేట జాతీయ రహదారిపై కొంత దూరం తీసుకెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. పోలీసులు శంకర్‌గౌడ్ మృతదేహాన్ని నర్సంపేటకు తీసుకెళ్లడానికి ఒప్పుకోలేదు. ఈ సందర్భంగా మంత్రి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. పోలీసుల తీరును తప్పుబట్టారు. దీంతో ఆర్టీసీ జేఏసీ, శంకర్‌గౌడ్ కుటుంబసభ్యుల నిర్ణయానికే వదిలేశామని చెప్పారు.

వాళ్లు మాట్లాడుకుని అంతిమ యాత్ర నిర్వహించాలని నిర్ణయించారన్నా  రు. తాము పబ్లిసిటీ కోసం రాలేదని స్పష్టంచేశారు. శంకర్‌గౌడ్ కుమారుడిని సైతం పోలీసులు కొట్టి స్టేషన్‌కు తరలించారంటే.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని కేంద్రమంత్రి పేర్కొన్నారు. శంకర్‌గౌడ్‌కు సొంత ఇల్లు కూడా లేదని, ప్రభుత్వం ఇచ్చే రూ.10 లక్షల సాయం దేనికి పనికొస్తుందని ప్రశ్నించారు. శంకర్‌గౌడ్ కుటుంబాన్ని అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌చేశారు.

ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమ్మె అంశంలో వెంటనే చర్యలు తీసుకొని, వారి డిమాండ్లను పరిష్కరించాలని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులెవరూ ఆత్మహత్యలకు పాల్పడొద్దని కోరారు. ఆర్టీసీ కార్మికులకు ఉద్యమం కొత్త కాదని, సకల జనుల సమ్మెలో ఆర్టీసీ కొట్లాడితేనే తెలంగాణ వచ్చిందని వెల్లడించారు. డిమాండ్ల సాధనలోనూ కొట్లాడాలే తప్ప ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు. ఆర్టీసీ కార్మికులకు బీజేపీ పూర్తిగా మద్దతిస్తున్నదని, వారి పక్షాన పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.