30 May, 2026 | 9:46 PM

Breaking News

ప్రభుత్వ జూనియర్ కళాశాల కోసం విద్యార్థుల ఎదురుచూపులు

30-05-2026 08:52 PM

మొయినాబాద్‌లో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్

మొయినాబాద్,(విజయక్రాంతి): మొయినాబాద్ మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల లేకపోవడంతో వేలాది మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) మండల కార్యదర్శి చరణ్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. జూన్ 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో మొయినాబాద్ మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల లేకపోవడం విద్యార్థులకు పెద్ద సమస్యగా మారిందన్నారు.

పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు తప్పనిసరిగా ప్రైవేట్ కళాశాలల్లో చేరాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ప్రైవేట్ కళాశాలలు అధిక ఫీజులు వసూలు చేయడం వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు విద్యను కొనసాగించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. కొంతమంది విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువును మధ్యలోనే మానివేసే పరిస్థితులు నెలకొంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

అలాగే ఉన్నత విద్య కోసం విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి రావడంతో సమయం, ప్రయాణ ఖర్చులు పెరుగుతున్నాయని చెప్పారు. మొయినాబాద్ మండలంలో వెంటనే ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేసి విద్యార్థుల విద్యా హక్కును పరిరక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కళాశాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని, లేనిపక్షంలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చరణ్ గౌడ్ హెచ్చరించారు.