24 March, 2026 | 1:51 AM

బస్టాండ్‌లో మురుగునీటి ప్రవాహం

24-03-2026 12:00 AM

దుర్గంధంతో ప్రయాణికుల ఇబ్బందులు 

ఆవరణలో నడవలేని పరిస్థితి 

పట్టించుకోని అధికారులు 

మేడ్చల్ అర్బన్, మార్చి 23 (విజయక్రాంతి): మేడ్చల్ బస్టాండు దుర్గంధపూరితంగా తయారైంది. మెయిన్ రోడ్డు నుంచి డ్రైనేజీ నీరు బస్టాండ్ ఆవరణలోకి వస్తుంది. దీంతో బస్టాండులో తీవ్ర దుర్గంధం తో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఆవరణ మొత్తం వరదల పారడం వల్ల ప్రయాణికులు నడవడానికి ఇబ్బంది పడుతున్నారు. బస్సులు ఎక్కలేకపోతున్నారు.

మురుగు నీటి వల్ల దోమలు ఎక్కువయ్యాయి. పది నిమిషాలు బస్సు కోసం వేచి చూడలేని పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు దుర్వాసనతో పాటు మరోవైపు దోమలతో ప్రయాణికులు సతమతమవుతున్నారు. మురుగునీరు డిపో వరకు వెళ్తుండడంతో డిపోలో ఆర్టీసీ కార్మికులు, సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన పట్టించుకోవడంలేదని ఆర్టీసీ కార్మికులు వాపోతున్నారు. 

అన్ని కాలనీలలో ఇదే పరిస్థితి 

బస్టాండ్ లోనే కాకుండా పట్టణంలోని అన్ని కాలనీలలో మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తోంది. కిష్టాపూర్ ప్రధాన రోడ్డు మీద మురుగునీరు ప్రవహించడం వల్ల వాహనదారులకు ఇబ్బంది అవుతుంది. వాహనాల రాకపోకల వల్ల మురుగునీరు రోడ్డు మీద వెళ్లే వారిపై పడుతోంది. ఉమా నగర్ శరన్ లాడ్జ్ వెనుక భాగంలో మురుగునీరు కొన్ని రోజులుగా రోడ్డుపై నిలిచింది. దీంతో ఆ గల్లీ ప్రజలు వాసన, దోమల విడద భరించలేకపోతున్నారు. ఇళ్ల నుంచి బయటకి రాలేకపోతున్నారు. కేఎల్‌ఆర్ కాలనీలోనూ మురుగునీరు రోడ్లమీద ప్రవహిస్తోంది. 

కార్పొరేషన్ లో విలీనం తర్వాత పెరిగిన కష్టాలు 

గతంలో మున్సిపాలిటీగా ఉన్న సమయంలో డ్రైనేజీ పొంగితే ఒకటి రెండు రోజుల్లో సమస్య పరిష్కారం అయ్యేది. కార్పొరేషన్ లో విలీనమైన తర్వాత కష్టాలు రెట్టింపు అయ్యాయి. మేడ్చల్ పట్టణం సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉంది. కార్పొరేషన్ లో విలీనమైన తర్వాత పట్టించుకునే అధికారులు కరువయ్యారు. మేడ్చల్ లో సర్కిల్ కార్యాలయం ఉంది. ఇక్కడ తగిన సిబ్బంది ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదు. ఇకనైనా కార్పొరేషన్ అధికారులు రోడ్లమీద మురుగునీరు ప్రవహించకుండా చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.