3 August, 2026 | 1:14 AM

దయనీయం పశువైద్యం..!

03-08-2026 12:02 AM

*ఖాళీలతోనే సతమతం

*211 పోస్టులకు 57 ఖాళీలు 

*ఇన్చార్జీలతో నెట్టుకొస్తున్న వైనం 

*పాడి, పాల ఉత్పత్తిలో తీవ్ర ప్రభావం 

నాగర్ కర్నూల్, ఆగస్టు 2 (విజయక్రాంతి): ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఎదురయ్యే అవకాశాల నేపథ్యంలో సాగునీటి ఆధారం లేని ప్రాంతాల్లో వరి, మొక్కజొన్న వంటి పంటలకు బదులుగా ప్రత్యామ్నాయ బిందు సేద్యం పంటలు, పాడి పరిశ్రమను ప్రోత్సహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటు పాల ఉత్పత్తిని వృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా చెబుతోంది.

అయితే ఈ లక్ష్యాల అమలుకు కీలకమైన పశుసంవర్ధక శాఖలో నాగర్ కర్నూల్ జిల్లాలో భారీగా ఖాళీలు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. జిల్లా బాస్ కుర్చీ సైతం ఖాళీ ఉండటంతో పర్యవేక్షణ లేకుండా పోతోంది.  గ్రామీణ ప్రాంతాల్లోని పశు సంపదను వృద్ధి చేసేందుకు వాటి ఆరోగ్య రక్షణ కోసం పశుసంవర్ధక శాఖ సిబ్బంది లేకపోవడంతో పాడి, పాల ఉత్పత్తి పై తీవ్ర ప్రభావం చూపుతోంది. సరైన మందులు కూడా అందుబాటులో లేక పోవడంతో మూగజీవాలు రోదిస్తున్న పరిస్థితి.

జిల్లాలో పశుసంవర్ధక శాఖకు మొత్తం 211 పోస్టులకు గాను 154 మాత్రమే భర్తీ కాగా 57 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ముఖ్యంగా రైతులకు ప్రత్యక్షంగా సేవలు అందించే 28 వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుల్లో 17 ఖాళీగా ఉండడం గమనార్హం. అలాగే 34 లైవ్స్టాక్ అసిస్టెంట్ పోస్టుల్లో 7, 34 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల్లో 6, 8 వెటర్నరీ లైవ్స్టాక్ ఆఫీసర్ పోస్టుల్లో 4 ఖాళీగా ఉన్నాయి. జిల్లా స్థాయి పర్యవేక్షణకు అవసరమైన డిప్యూటీ డైరెక్టర్ పోస్టు కూడా ఖాళీగానే ఉంది.

ఇదిలా ఉండగా, జిల్లాలోని 21వ పశుసంపద గణన ప్రకారం 2.10 లక్షల పశువులు, 1.06 లక్షల గేదెలు, 9.13 లక్షల గొర్రెలు, 1.80 లక్షల మేకలు ఉన్నాయి. ఇంత భారీ పశుసంపదకు అవసరమైన వైద్య సేవలు, టీకాలు, కృత్రిమ గర్భధారణ, వ్యాధి నియంత్రణ వంటి సేవలను అందించాలంటే తగిన సిబ్బంది అవసరమని రైతులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం పాడి పరిశ్రమ విస్తరణకు ప్రాధాన్యత ఇస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయకపోతే ఆశించిన ఫలితాలు సాధించడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎల్నినో నేపథ్యంలో పాడి పరిశ్రమపై ప్రభుత్వం పెట్టుకున్న ఆశయాలకు నాగర్ కర్నూల్ జిల్లాలో పశుసంవర్ధక శాఖలోని సిబ్బంది కొరత ఎంత మేర ప్రభావం చూపుతుందో వేచి చూడాల్సిందే.