19 August, 2026 | 10:12 PM

అంధకారంలో బీడీ వర్కర్స్ కాలనీ

19-08-2026 09:11 PM

నాలుగు రోజులుగా వెలగని వీధి దీపాలు

కాలనీవాసుల తీవ్ర ఇబ్బందులు

పట్టించుకోని మున్సిపల్ అధికారులు

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని బీడీ వర్కర్స్ కాలనీలో గత నాలుగు రోజులుగా వీధి దీపాలు వెలగకపోవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రివేళల్లో కాలనీలోని ప్రధాన రహదారులు, అంతర్గత వీధులు చీకటిమయంగా మారడంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ఇటీవల కాలనీలో కొత్త విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసినప్పటికీ వాటికి వీధి దీపాలు ఏర్పాటు చేయకపోవడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసిన వెంటనే వీధి దీపాలు అమర్చాలని సంబంధిత అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని వారు వాపోతున్నారు.

కాలనీలో పెద్ద సంఖ్యలో కుటుంబాలు నివసిస్తున్న నేపథ్యంలో రాత్రి సమయంలో చీకటి కారణంగా వృద్ధులు, మహిళలు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. అంతేకాకుండా చీకటి కారణంగా రహదారిపై గుంతలు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కొత్తగా ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలకు వీధి దీపాలు అమర్చి కాలనీకి వెలుగులు తీసుకురావాలని వారు కోరుతున్నారు. అధికారులు స్పందించి సమస్యను తక్షణమే పరిష్కరించాలని కాలనీ వాసులు కోరుతున్నారు.