25 June, 2026 | 11:36 PM

జియో సంస్థ దిష్టిబొమ్మ దహనం

25-06-2026 04:32 PM
  1. జియో టెలికాం నెట్వర్క్ పై  ఆవేదన 
  2. జియో సంస్థకు వ్యతిరేకంగా నినాదాలు
  3. జియో సంస్థ దిష్టిబొమ్మను దహనం

ఉట్నూర్, జూన్ 25,(విజయక్రాంతి): ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలోని చందూరి గ్రామపంచాయతీలో గురువారం స్థానిక బీఆర్ఎస్ నాయకుడు భరత్ చౌహన్ పర్యటించారు. గ్రామస్తులతో సమావేశమై గ్రామంలోని వివిధ సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ప్రధానంగా జియో నెట్వర్క్ సేవలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రతి నెల రూ.350 వరకు రీఛార్జ్ చేసుకుంటున్నప్పటికీ సరైన మొబైల్ సిగ్నల్, ఇంటర్నెట్ సేవలు అందడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. నెట్వర్క్ సమస్యల కారణంగా విద్యార్థులు ఆన్‌లైన్ విద్య, యువత ఉద్యోగ సమాచారం, రైతులు ప్రభుత్వ సేవలు పొందడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

ఈ సందర్భంగా భరత్ చౌహన్ మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంత ప్రజల నుండి డబ్బులు వసూలు చేస్తూ సరైన సేవలు అందించకపోవడం జియో సంస్థ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. వెంటనే చందూరి గ్రామంతో పాటు ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలోని అన్ని గ్రామాల్లో నెట్వర్క్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం గ్రామస్తులతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించి జియో సంస్థకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా జియో సంస్థ దిష్టిబొమ్మను దహనం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు.