ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి
ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి, మాదాసు శ్రీనివాస్
గజ్వేల్, జూన్ 25: గజ్వేల్ మండలం రంగంపేట్ గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో నిర్వహించిన నవగ్రహాల ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, ప్యాక్స్ చైర్మన్ జె. వెంకటేష్ గౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రామాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో ఐక్యతను పెంపొందించడంతో పాటు శాంతి, సామరస్యాలకు దోహదపడతాయన్నారు. నవగ్రహాల ప్రతిష్ఠ మహోత్సవం విజయవంతంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. గ్రామ ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని దేవుడిని ప్రార్థించినట్లు తెలిపారు.
మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. గ్రామాల్లో దేవాలయాల అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. రంగంపేట్ గ్రామం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సర్పంచ్ నాగరాజు, నాయకులు రమేష్ గౌడ్, దుర్గారెడ్డి, మనోహర్, కరుణాకర్ రెడ్డి, స్వామి, ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.






