ఆలస్యం ఆయాసం..!
- ఉపకరణాల పంపిణీకి తీవ్ర జాప్యం
- ఇబ్బందులకు గురైన దివ్యాంగులు.
- సుమారు 7 గంటల పాటు ఎండలోనే నిరీక్షణ.
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): తమ ఎదుగుదలకు, ఆత్మస్థైర్యానికి తోడుగా దివ్యాంగులకు ప్రభుత్వం ఉపకరణాలను మంజూరి చేసినా పంపిణీ కార్యక్రమం అధికారులు ఆలస్యం చేస్తూ సుమారు 7 గంటల పాటు ఎండలోనే నిరీక్షించాల్సిన పరిస్థితి కల్పించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ప్రాంగణంలో స్త్రీ, శిశు, వయోవృద్ధులు దివ్యాంగుల సంక్షేమ శాఖ, మెప్మా ఆధ్వర్యంలో జిల్లాలోని 44 మంది దివ్యాంగులకు వాహనాలను పంపిణీ చేశారు.
అలాగే డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు 17 ల్యాప్‌టాప్‌లు, 2 సెల్‌ఫోన్లు, అదనంగా 20 మంది బాలికలకు సైకిళ్లు, 6 మోటార్ వీల్‌చైర్లు, 10 బ్యాటరీ ట్రైసైకిళ్లు, ఒక బ్యాటరీ ఆటోను లబ్ధిదారులకు అందించారు. పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు చిక్కుడు వంశీకృష్ణ, కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి చేతులు మీదుగా పంపిణీ చేశారు.
కానీ ఉదయం ప్రారంభం కావాల్సిన పంపిణీ కార్యక్రమం సాయంత్రం వరకు సాగదీశారు. అదే సమయంలో జిల్లా అభివృద్ధి సమన్వయ కమిటీ సమావేశం (దిశ ) కార్యక్రమంలొ పాల్గొనడంతో దివ్యాంగులకు నిరీక్షణ తప్పలేదు. మానవత్వంతో ఆలోచించి ముందుగానే దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేయాల్సి ఉన్నది. దీంతో సాయంత్రం దాకా కలెక్టరేట్ ఆవరణలోనే ఎండలోనే తిండి తిప్పలు లేకుండా కనీసం త్రాగునీరు కూడా నోచుకోలేక తీవ్ర ఇబ్బందులకు గురయ్యామని దివ్యాంగులు పెదవి విరిచారు.






