ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం
తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య
కోదాడ: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది ప్రతి పౌరుడికి అత్యంత శక్తివంతమైన వజ్రాయుధం వంటిదని తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య పేర్కొన్నారు. శనివారం తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కోదాడ పట్టణం పెరిక హాస్టల్ ప్రాంగణంలో నిర్వహించిన పెరిక కులస్తుల ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుతం ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఓట్ల నమోదు, తొలగింపుల ప్రక్రియ కొనసాగుతోందన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా పెరిక కుల బిడ్డలు వెంటనే ఫారాలు నింపి బీఎల్వో లకు అందించి ఓటు హక్కు నమోదు చేసుకోవాలని కోరారు. ప్రజాస్వామిక దేశంలో ఓటే మన గుర్తింపు అని, సంక్షేమ పథకాల లబ్ధికి కూడా ఇది ఎంతగానో ముడిపడి ఉంటుందన్నారు. అనంతరం దేశ, విదేశాల్లో క్రీడల్లో సత్తా చాటిన కిత శ్రీనివాసరావుకు అభినందనలు తెలిపారు.






