అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి
ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
ఆమనగల్లు,జూలై 25(విజయక్రాంతి): ప్రతి బూత్‌లో అర్హులైన ప్రతి ఒక్కరి ఓటును కాపాడటమే కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వ లక్ష్యమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి స్పష్టం చేశారు. శనివారం కల్వకుర్తి క్యాంపు కార్యాలయంలో 6 మండలాల బీఎల్ఏలు (బూత్ లెవల్ ఏజెంట్లు), బూత్ కమిటీ సభ్యులతో ఆయన విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ప్రభుత్వ గడువుతో సంబంధం లేకుండా ఈ నెల 30 లోగానే అర్హులైన అందరి ఓట్ల డిజిటలైజేషన్ పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటికే 85 శాతం ప్రక్రియను పూర్తి చేసిన బూత్ సభ్యులను ఆయన అభినందించారు.
పేర్ల చేర్పులు, మార్పులు, తొలగింపుల్లో అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని సూచించారు. కార్యకర్తలే పార్టీకి వెన్నెముక అని, నాయకులంతా సమన్వయంతో పనిచేసి పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు శంకర్,శ్రీనివాస్ రెడ్డి కిషన్ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి,శివలింగం, మాజీ ఎంపీటీసీ అయిళ్ల శ్రీనివాస్ గౌడ్, పీబీసీ మాజీ సభ్యుడు ఠాకూర్ బాలాజీ సింగ్,జిల్లా సీనియర్ కాంగ్రెస్ నేత రఘు రాములు,పలువురు మండల, మున్సిపల్ అధ్యక్షులు మరియు పార్టీ ముఖ్య నాయకులు, బీఎల్ఏలు పాల్గొన్నారు.






