ఏడుగురు MBBS విద్యార్థులు సస్పెండ్— కేఎంసీలో ర్యాగింగ్ కలకలం!
హైదరాబాద్: జూనియర్లను ర్యాగింగ్ చేశారనే ఆరోపణలపై వరంగల్‌లోని కాకతీయ వైద్య కళాశాల (KMC) అధికారులు ఏడుగురు ఎంబీబీఎస్(MBBS) మూడవ సంవత్సరం విద్యార్థులపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. కాకతీయ వైద్యకళాశాలలో ర్యాగింగ్ ఘటనపై ప్రిన్సిపల్ సంధ్య స్పందించారు. విచారణ చేసిన బాధ్యులపై చర్యలు తీసుకున్నామని కేఎంసీ ప్రిన్సిపల్ పేర్కొన్నారు. కేఎంసీలో ర్యాగింగ్ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని ప్రిన్సిపల్ తెలిపారు. జూనియర్లను మోకాళ్లపై నిలబెట్టారు.. గోడకుర్చీలు వేయించారని చెప్పారు. ఏడుగురు విద్యార్థులను సస్పెండ్ చేసినట్లు కేఎంసీ ప్రిన్సిపల్ సంధ్య ప్రకటించారు. అలాగే కోర్సు కాలమంతటికీ హాస్టల్ నుండి బహిష్కరించినట్లు తెలిపారు. ఇలాంటివి మరోసారి జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
కొంతమంది ద్వితీయ సంవత్సరం ఎంబీబీఎస్ (Bachelor of Medicine, Bachelor of Surgery) విద్యార్థులు తమ వాట్సాప్ గ్రూపులో తృతీయ సంవత్సరం విద్యార్థులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. ఇటీవల రెండవ సంవత్సరం విద్యార్థుల వ్యాఖ్యల గురించి తెలుసుకున్న మూడవ సంవత్సరం విద్యార్థులు వారిని శిక్షించాలని అనుకున్నారు. వారు 20 మంది రెండవ సంవత్సరం విద్యార్థులను హాస్టల్ టెర్రస్‌పైకి పిలిపించి, మోకాళ్లపై కూర్చోబెట్టి, క్షమాపణ చెప్పించి, మళ్లీ అలాంటి ప్రవర్తనను పునరావృతం చేయబోమని ప్రమాణం చేయించారు. విద్యార్థులలో ఒకరు ఈ సంఘటనను తన మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించి, వరంగల్ కమిషనరేట్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు, నేషనల్ మెడికల్ కౌన్సిల్ (National Medical Council) కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం (KNRUHS) అధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుల నేపథ్యంలో, కళాశాల అధికారులు తప్పు చేసిన మూడవ సంవత్సరం విద్యార్థులపై చర్యలు తీసుకున్నారు.




