1 June, 2026 | 1:14 AM

నిప్పు పెడితే ముప్పే..

01-06-2026 12:27 AM
  1. వరికొయ్యల దహనంతో అగ్నిప్రమాదాలు 
  2. నేల సారానికి, పర్యావరణానికి తీవ్ర నష్టం
  3. ఎండలో గాలులకు చెలరేగుతున్న మంటలు
  4. కలియదున్నితేనే భూసారం

చివ్వెంల, మే 31 :వరి కోతలు పూర్తయ్యాక పొలాల్లో మిగిలే వరికొయ్యలను తగులబెట్టడం గ్రామీణ ప్రాంతాల్లో సాధారణంగా కనిపిస్తున్న దృశ్యంగా మారింది. అ యితే ఈ అలవాటు రైతులకు తెలియకుండానే భారీ నష్టాలను మిగులుస్తోందని వ్యవ సాయ అధికారులు, శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఎండాకాలంలో వీచే వేడి గాలులకు చిన్న మంట కూడా పెద్ద అగ్నిప్రమాదాలకు దారి తీస్తోంది. కొయ్యకాళ్లకు నిప్పు పెట్టిన కొద్ది నిమిషాల్లోనే మంటలు సమీప ప్రాంతాలకు వ్యాపించి పంటచేలు, తోటలు, పశువుల కొట్టాలు, విద్యుత్ సామగ్రిని దగ్ధం చేస్తున్నాయి.

ఇటీవల అనేక గ్రామాల్లో వరికొయ్యలను కాల్చడంతో మంటలు అదుపుతప్పి ఈత వనాలు, ఆయిల్పామ్ తోటలు, మామిడి తో టలు, కూరగాయల పంటలు అగ్నికి ఆహుతైన ఘటనలు చోటుచేసుకున్నాయి. విద్యు త్ మోటర్లు, ట్రాన్స్ ఫార్మర్లు, వైర్లు, పైపులు, వ్యవసాయ పరికరాలు కాలిపోవడంతో రైతులు తీవ్ర ఆర్థిక నష్టాన్ని చవిచూస్తున్నారు. కొన్ని ప్రాం తాల్లో మంటలు నివాసాల వరకు వ్యాపించి ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి.

నేల సారానికి తీరని నష్టం

కొయ్యకాళ్లను కాల్చడం వల్ల కనిపించే నష్టం ఒక్కటే కాదు.. భూమి లోపల మరింత ప్రమాదం దాగి ఉందని నిపుణులు చెబుతున్నారు. నేలకు సారాన్ని అందించే సూక్ష్మజీ వులు, పురుగులు, జీవకణాలు పూర్తిగా నశించిపోతున్నాయి. భూమిలో సహజంగా ఉండే పోషకాలు తగ్గిపోవడంతో నేల సారవంతత దెబ్బతింటోంది. దీని ప్రభావం తరువాతి పంటల దిగుబడిపై తీవ్రంగా పడుతోంది. రైతులు ఎక్కువ ఎరువులు వాడాల్సి న పరిస్థితి ఏర్పడుతోంది.

మరోవైపు కొయ్యలను తగులబెట్టడం వల్ల పెద్ద ఎత్తున పొగ వాతావరణంలోకి వెళ్తాంది. దీంతో గాలి కాలుష్యం పెరిగి ప్రజల కు శ్వాసకోశ సమస్యలు తలెత్తుతున్నాయి. పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు పొగ కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో పొగతో ఊపిరాడక ప్రమాదాలు జరిగిన ఘటనలూ ఉన్నాయని అధికారులు గుర్తు చేస్తున్నారు.

కలియదున్నితేనే భూసారం:

వరికొయ్యలను కాల్చకుండా పొలంలోనే కలియదున్నితే భూమికి సేంద్రియ ఎరువులా ఉపయోగపడుతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. వరిగడ్డిని కంపోస్టుగా మార్చి వినియోగిస్తే భూమి సారవంత త పెరుగుతుందని చెబుతున్నారు. పశువుల మేతగా, ఇతర అవసరాలకు కూడా వరిగడ్డినిఉపయోగించుకోవచ్చని సూచిస్తున్నారు. కొయ్యకాలును తగులబెట్టడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందని వ్యవసాయ శాఖ హెచ్చరిస్తోంది.

రైతులు అవగాహనతో వ్యవహరించి పొలాల్లో నిప్పు పెట్టకుండా ఉంటే అగ్నిప్రమాదాలను నివారించడంతో పాటు భూసారాన్ని, పర్యావర ణాన్ని కూడా కాపాడుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. రైతన్నలు ప్రకృతిని రక్షిస్తూ సుస్థిర వ్యవసాయ పద్ధతులను అనుసరించాలని  అప్పుడే నాణ్యమైన దిగుబడులను సాధించి మంచి ఫలితాలను పొందవచ్చని పలువురు కోరుతున్నారు.

అవగాహన కల్పిస్తున్నాం

వరికొయ్యలను తగులబెట్ట కుండా రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. వానా కాలం పంటల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో రైతువేదికల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. వరికొ య్యలను కాల్చడం వల్ల కలిగే నష్టాలను రైతులకు వివరిస్తున్నాము. రైతులు ఆచరణలో మార్పు తీసుకువచ్చేందుకు మా వంతు కృషి చేస్తున్నాం.

డి . వెంకటేశ్వర్లు, మండల వ్యవసాయ అధికారి, చివ్వెంల