సర్వర్ డౌన్.. నిలిచిన రిజిస్ట్రేషన్
- గంటల తరబడి ఆఫీసుల ముందు పడిగాపులు
- అమ్మకం, కొనుగోలు దారులకు తప్పని తిప్పలు
- ఈనెల 29 నుంచి మోరాయిస్తున్న సర్వర్లు
హుజూర్ నగర్, జూన్ 30 : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 143 రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు గత రెండు రోజుల నుండి పూర్తిగా అంతరాయం కలుగుతుంది.సాంకేతిక లోపాలు తలెత్తి.. సర్వర్లు పనిచేయకపోవడంతో..ఈనెల 29 నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల వద్ద తీవ్ర గందరగోళం నెలకొంది. రిజిస్ట్రేషన్లు,స్లాట్ బుకింగ్లు, చలానాల చెల్లింపుల కోసం వినియోగదారులు బారులు తీరారు.. సర్వర్లు పనిచేయక పోవడంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది.
దీంతో వినియోగదారులు తీవ్ర అవస్థలు పడ్డారు.తెలంగాణ వ్యాప్తంగా ఈనెల 29 నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు బ్రేక్ పడింది.మంగళవారం ఉదయం నుంచి సర్వర్లు పని చేయకపోవడంతో..సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పనులు సాగలేదు.దీంతో స్లాట్ బుకింగ్ చేసుకుని.. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన ప్రజలు.. గంటల తరబడి ఆఫీసుల ముందు పడిగాపులు కాయాల్సి వచ్చింది.సోమవారం ఉదయం నుంచే టెక్నికల్ సమస్యలు తలెత్తడంతో సర్వర్లు పనిచేయకుండా పోయాయి.
దీంతో తెలంగాణ వ్యాప్తంగా భూములు, ఆస్తులకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు ఎక్కడికక్కడ పూర్తిగా నిలిచిపోయాయి. స్లాట్ బుకింగ్లు, చలాన్ల చెల్లింపులు కూడా ఆగిపోయాయి.143 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల వద్ద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.భూమి బదిలీ చేసేందుకు రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వచ్చిన కొందరు నిరాశతో వెనుదిరిగి వెళ్తున్నారు.. మరికొందరు రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో అక్కడే వేచి చూశారు. కొన్ని చోట్ల రిజిస్ట్రేషన్ శాఖ అధికారులను జనం నిలదీశారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లోని సర్వర్లలో సాంకేతిక లోపాలు తలెత్తడంతోనే ఈ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు.
పునరుద్ధరణ పనులు చేసినా పని చేయని సర్వర్..
రిజిస్ట్రేషన్ శాఖలో సర్వర్ల పునరుద్ధరణ పేరుతో ఈనెల 26 నుంచి 28 వరకు సెలవు రోజులు కావడంతో సర్వర్లు పునరుద్ధరణ పనులు చేపట్టారు.దీంతో ఈ నెల 29 నుంచి ఉదయం ఆఫీసులు ప్రారంభం అయినప్పటి నుంచే సర్వర్లు మొరాయించడంతో భూముల క్రయ, విక్రయాలు పూర్తిగా నిలిచిపోయి.. వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో రిజిస్ట్రేషన్లకు సంబంధించిన స్లాట్ బుకింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఈ కేవైసీ సహా రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఏ పనీ సాగలేదు.
రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్లు బుక్ చేసుకుని.. కొనుగోలుదారులు, అమ్మకందారులు సాక్షులతో సహా రిజిస్ట్రార్ కార్యాలయాలకు వచ్చి ఉదయం నుంచి పడిగాపులు కాసిన ఫలితం లేకుండా పోయింది. మరోవైపు.. దూర ప్రాంతాల నుంచి ఆఫీసులకు వచ్చిన వారు సర్వర్లు ఎప్పుడు పని చేస్తాయి..తమ పని ఎప్పుడు అవుతుందో తెలియక తీవ్ర ఆందోళన చెందారు.
ఫలించని రిజిస్ట్రేషన్ శాఖాధికారుల ప్రయత్నాలు..
రిజిస్ట్రేషన్ల శాఖ మెయిన్ సర్వర్లలో టెక్నికల్ సమస్యల వల్ల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలు నిలిచిపోయాయి.దీంతో టెక్నికల్ టీమ్లను రంగంలోకి దించిన అధికారులు... సర్వర్ మొరాయింపులను సరి చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. సమస్యను గుర్తించి సేవలను తిరిగి అందుబాటులోకి తీసుకువస్తామని అధికారులు చెప్పినా ఫలితం లేకుండా పోయింది. పరిస్థితి పూర్తి స్థాయిలో ఎప్పుడు సాధారణ స్థితికి వస్తుందో తెలియక రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద ప్రజలు తీవ్ర అవస్థలు పడుతూ కూర్చున్నారు.
ఇబ్బందులు తలెత్తకుండా చేశాం..
రిజిస్ట్రేషన్ శాఖ కార్డు సర్వర్ లో టెక్నికల్ సమస్య వల్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సోమవారం ఉదయం నుండి అంతరాయం కలుగుతున్న మాట వాస్తవమేనని అన్నారు. జిల్లా ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ వారి సలహాలు, సూచన మేరకు రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన కొనుగోలు, అమ్మకందారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పనులను త్వరగా పూర్తి చేసే ప్రయత్నం చేశాం.
దోసపాటి శ్రీవాణి, ఇంచార్జి సబ్ రిజిస్ట్రార్, హుజూర్ నగర్






