17 July, 2026 | 9:10 PM

వరుస చోరీల గుట్టురట్టు

17-07-2026 09:10 PM

ఒక్క నిందితుడితో రూ.లక్షల విలువైన సొత్తు రికవరీ.. 48 కేసుల్లో ప్రమేయం

హుస్నాబాద్: హుస్నాబాద్, అక్కన్నపేట పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇటీవల వరుసగా జరిగిన ఇళ్లు, దుకాణాలు, దేవాలయాల చోరీల కేసులను పోలీసులు ఛేదించారు. సీరియల్ చోరీలకు పాల్పడిన నిందితుడు రౌతు పవన్‌ను పోలీసు కస్టడీలోకి తీసుకుని విచారించగా, చోరీ చేసిన పంచలోహ విగ్రహం, బంగారం, వెండి, నగదు రికవరీ చేశారు. శుక్రవారం హుస్నాబాద్ ఏసీపీ సదానందం విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు.

మహాదేవపూర్ మండలం దుబ్బగూడెంకు చెందిన రౌతు పవన్ 12 ఏళ్ల క్రితమే ఇంటి నుంచి వెళ్లిపోయి దొంగతనాలను వృత్తిగా మార్చుకున్నాడని ఏసీపీ తెలిపారు. భార్యకు దూరంగా ఉంటూ మరో మహిళతో సహజీవనం చేస్తున్న నిందితుడు కరీంనగర్‌ను కేంద్రంగా చేసుకుని పలు ప్రాంతాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలిందన్నారు.

జూన్ 18, జూన్ 26, జూలై 2 తేదీల్లో హుస్నాబాద్, అక్కన్నపేట పరిధిలో చోరీలకు పాల్పడిన పవన్.. ముందుగా చౌటపల్లి పెద్దమ్మ ఆలయంలోని 11 కిలోల బరువున్న పంచలోహ విగ్రహాన్ని అపహరించాడు. అనంతరం హుస్నాబాద్ పట్టణంలోని బాలయ్య ఇంట్లో బంగారు ఆభరణాలు చోరీ చేసి, అదే రోజు మరో మూడు దుకాణాల్లో దొంగతనాలకు పాల్పడ్డాడు. రెండు రోజుల తర్వాత మార్కండేయస్వామి ఆలయం, హనుమాన్ ఆలయం, మరో ఇంటిలోనూ చోరీలు చేసినట్లు విచారణలో ఒప్పుకున్నాడని వివరించారు.

హుస్నాబాద్ సీఐ కె. శ్రీధర్ నిందితుడిని పోలీసు కస్టడీలోకి తీసుకుని విచారించగా, చోరీ సొత్తును కరీంనగర్‌లో దాచిపెట్టినట్లు వెల్లడించాడన్నారు. దీంతో పోలీసులు అక్కడికి వెళ్లి 11 కిలోల పంచలోహ విగ్రహం, 56 గ్రాముల బంగారు ఆభరణాలు, 76 గ్రాముల వెండి, రూ.23,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. కొంత సొత్తును సహజీవనం చేస్తున్న మహిళ వద్ద దాచినట్లు చెప్పడంతో అక్కడి నుంచి కూడా రికవరీ చేసినట్లు తెలిపారు.

నిందితుడు కరీంనగర్, మంచిర్యాల, హుజూరాబాద్, హుస్నాబాద్ తదితర ప్రాంతాల్లో నమోదైన 48 చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇటీవల మంచిర్యాల పోలీసులు అరెస్టు చేయగా, అనంతరం పోలీసు కస్టడీలో విచారణ చేపట్టడంతో హుస్నాబాద్ ప్రాంతంలో జరిగిన చోరీల గుట్టురట్టైంది.

ఈ కేసులను వేగంగా ఛేదించి చోరీ సొత్తును రికవరీ చేయడంలో ప్రతిభ కనబర్చిన హుస్నాబాద్ సీఐ కె. శ్రీధర్, ఎస్‌ఐ పి. లక్ష్మారెడ్డి, సీసీఎస్ బృందం, హెడ్ కానిస్టేబుల్ రవీందర్, కానిస్టేబుళ్లు ఎన్. నరేశ్, డి. శ్రీనాథ్తో పాటు దర్యాప్తులో పాల్గొన్న పోలీసు సిబ్బందిని ఏసీపీ సదానందం అభినందించారు. బాధితులకు చోరీ సొత్తు తిరిగి అందేలా చేసిన పోలీసు బృందాన్ని ఆయన ప్రశంసించారు.