1 May, 2026 | 3:59 PM

డబల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలి

01-05-2026 02:36 PM

జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్

నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): నిరుపేదలకు గృహ వసతి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పంపిణీ కొరకు నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అన్నారు. శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్సు డిపో వెనుక నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇప్పటివరకు జరిగిన పనుల పురోగతిపై హౌసింగ్ పీడీతో ఆరా తీసిన ఆయన, ఇంకా పూర్తికాని పనులపై అధికారులను ప్రశ్నిస్తూ ఆలస్యానికి గల కారణాలను తెలుసుకున్నారు.

ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా, సజావుగా నిర్వహించాలన్నారు. కాంట్రాక్టర్ ఇటీవల మరణించిన నేపథ్యంలో విద్యుత్, తాగునీరు, రహదారులు వంటి మౌలిక వసతుల పనులను పూర్తి చేయడానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనుల్లో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని హెచ్చరిస్తూ, పనులపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని, సమస్యలు ఎదురైతే వెంటనే పరిష్కార చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆరు బ్లాకుల్లో నిర్మించిన 192 ఇళ్లకు అర్హులైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట హౌసింగ్ పీడీ సంగప్ప, నాగర్ కర్నూల్ మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.