5 August, 2026 | 4:19 AM

ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బందికి సీజనల్

04-08-2026 05:03 PM

వ్యాధులపై అవగాహన

టేకులపల్లి, (విజయక్రాంతి): వర్షాకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధుల నివారణకు ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని టేకులపల్లి మండలం సులానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ కంచర్ల వెంకటేష్ సూచించారు. మంగళవారం స్థానిక పీహెచ్‌సీలో ఆయన ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బందికి శిక్షణా, సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా, విరేచనాలు, టైఫాయిడ్, వైరల్ జ్వరాల లక్షణాలు, నివారణ చర్యలు, ముందస్తు జాగ్రత్తలు, ప్రజలకు అందించాల్సిన ఆరోగ్య సూచనలపై అవగాహన కల్పించారు.

గ్రామాల్లో జ్వర సర్వేలు, ఇంటింటి సందర్శనలు, దోమల నివారణ చర్యలు, పరిసరాల పరిశుభ్రత, సురక్షిత తాగునీటి సరఫరా, వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య సంరక్షణ, టీకాల కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. గ్రామాల్లో నీటి నిల్వలు లేకుండా చర్యలు చేపట్టడం, ఫాగింగ్ నిర్వహించడం, పైపుల లీకేజీలను సరిచేయడం, పంచాయతీ సిబ్బంది సహకారంతో ప్రజారోగ్య పరిరక్షణకు కృషి చేయాలని తెలిపారు.

సీజనల్ వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి బాధితులను వెంటనే ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలకు తరలించేలా ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్ గన్య, పబ్లిక్ హెల్త్ నర్స్ ఆఫీసర్ చంద్రకళ, ఆరోగ్య విస్తరణాధికారి పున్నమయ్య, సూపర్వైజర్లు గుజ్జా విజయ, కౌసల్య సింగ్, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.