25 August, 2026 | 12:05 AM

గిరిజన నాయకుడిపై అగ్రకులాల కుట్ర

24-08-2026 10:48 PM

అసత్య ప్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలి 

కాంగ్రెస్ నాయకురాలు కొత్త విద్యారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి

కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు రమేశ్ నాయక్ 

వనస్థలిపురం ఏసీపీకి గిరిజన నాయకుల ఫిర్యాదు

ఎల్బీనగర్: కులం పేరుతో తనను అవమానిస్తూ.. తన వ్యక్తిత్వాన్ని, కుటుంబ గౌరవాన్ని దెబ్బతీసేలా నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ కాంగ్రెస్‌ నాయకుడు కేతావత్‌ రమేశ్ నాయక్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనులు రాజకీయంగా ఎదగకుండా అగ్రకులాల నాయకులు కుట్ర చేస్తున్నారని, తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని, దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కొవాలని కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు కేతావత్ రమేశ్ నాయక్ సవాల్ చేశారు. తనపై అసత్యపు ఆరోపణలు చేస్తున్న కొత్త విద్యారెడ్డిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని సోమవారం వనస్థలిపురం ఏసీపీ కాశిరెడ్డికి కాంగ్రెస్ పార్టీ సాహెబ్ నగర్ డివిజన్ అధ్యక్షుడు కేతావత్ రమేశ్ నాయక్ గిరిజన సంఘాల నాయకులతో కలిసి ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజన బిడ్డనైన తనపై కావాలనే కొత్త విద్యా రెడ్డి అసత్యపు ఆరోపణలు చేస్తుందన్నారు. ఆమె ఆరోపించిన విధంగా తనకి ఎలాంటి స్పా సెంటర్లు లేవని, ఎనిమిదేండ్లు తాను సాహెబ్ నగర్ డివిజన్ లో నివసిస్తున్నానని తెలిపారు. ఎన్నో ఏండ్లుగా పార్టీ కోసం కష్టపడితే తనను గుర్తించి, కాంగ్రెస్ పార్టీ సాహెబ్ నగర్ డివిజన్ అధ్యక్షుడిగా నియమించారని తెలిపారు. గిరిజన బిడ్డ డివిజన్ అధ్యక్షుడిగా ఉంటే ఓర్వలేక అగ్రకులాల నాయకులు తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తనపై ఆరోపణలు చేసిన కొత్త విద్యారెడ్డి గతంలో వైఎస్సార్సీపీలో ఉండి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి  రాగానే తిరిగి పార్టీలో చేరిందన్నారు.

అలాంటి వ్యక్తి ఒక గిరిజన బిడ్డకు డివిజన్ అధ్యక్షుడు పదవి ఇస్తే ఓర్వలేక సోషల్ మీడియాలో తనను ఒక వ్యభిచారం చేయించే వ్యక్తిలా చిత్రీకరిస్తుందని, ఆ వీడియోలతో తన కుటుంబం మానసిక ఆవేదన చెందుతుందని, ప్రస్తుతం తన భార్య హాస్పిటల్లో ఉందని, ఎదిగిన పిల్లలు నలుగురిలో తిరుగలేక పోతున్నామంటూ కన్నీటి పర్యంతమయ్యారు. గతంలో తనపై బీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రపూరితంగా కేసు పెట్టిందని, కానీ కోర్టు తనకి క్లీన్ చిట్ ఇచ్చిందని తెలిపారు.  ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండైన జక్కడి ప్రభాకర్ రెడ్డి తన ఇంటికి కొత్త విద్యారెడ్డితో సోషల్ మీడియాలో ఆరోపణలు చేయిస్తున్నారని ఆరోపించారు. “నాకు ఒక్క స్పా సెంటర్‌ కూడా లేదు.

తనను రాజకీయంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఆరోపణలు చేస్తున్నారు” అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విధంగా చేస్తే తన కుటుంబ సభ్యులంతా కలిసి వారి ఇంటి ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు.  కొత్త విద్యారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్‌ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. మీడియా ప్రసారాలు, వీడియోలు, సోషల్‌ మీడియా పోస్టులను పరిశీలించి, వాటి వెనుక ఉన్న వ్యక్తులపై కూడా విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో గిరిజన నాయకులు రాంబాబు నాయక్, బాలాజీ నాయక్, నంద కిశోర్, శశి,  శంకర్ నాయక్, శ్రీనివాస్ నాయక్, బాల్ సింగ్, గాంధీ నాయక్, చందు నాయక్, దాసు నాయక్ తదితరులు పాల్గొన్నారు.