25 August, 2026 | 12:46 AM

రోడ్డు భద్రతపై డ్రైవర్లకు అవగాహన

25-08-2026 12:03 AM

మహబూబాబాద్, ఆగస్టు 24 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో ప్రైవేట్ పాఠశాలల బస్సు యజమానులు, డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. పాఠశాల బస్సులు నడిపే డ్రైవర్లు రవాణా నిబంధనలు పాటిస్తూ విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని డీటీఓ శంకర్ నాయక్ సూచించారు. ఇటీవల వరుసగా చోటుచేసుకున్న పాఠశాల బస్సు ప్రమాదాల నేపథ్యంలో జిల్లా రవాణా శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.

ఇటీవల జరిగిన సెయింట్ పాల్ హైస్కూల్ బస్సు ప్రమాద ఘటన స్థలాన్ని డీటీఓ శంకర్ నాయక్ స్వయంగా పరిశీలించారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను పరిశీలించి, డ్రైవర్లు అప్రమత్తంగా వాహనాలను నడపాల్సిన అవసరాన్ని వివరించారు. ఈ సందర్భంగా పాఠశాల బస్సుల ఫిట్నెస్, డ్రైవర్ల నైపుణ్యం, వేగ నియంత్రణ, ట్రాఫిక్ నిబంధనల పాటింపు, విద్యార్థుల భద్రత తదితర అంశాలపై అవగాహన కల్పించారు.

చిన్నపాటి నిర్లక్ష్యం కూడా విద్యార్థుల ప్రాణాలకు ముప్పుగా మారే అవకాశం ఉన్నందున డ్రైవర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. కనీసం ఐదేళ్ల డ్రైవింగ్ అనుభవం ఉన్న వారినే పాఠశాల బస్సు డ్రైవర్లుగా నియమించుకోవాలని, 60 సంవత్సరాలు దాటిన వారిని స్కూల్ బస్సు డ్రైవర్లుగా నియమించరాదని పాఠశాల యాజమాన్యాలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంవీఐ వెంకట్రెడ్డి, ఎంఈఓ బుచ్చయ్య, మండల ట్రాస్మా అధ్యక్షులు నరేష్, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య ప్రతినిధులు, స్కూల్ బస్సు డ్రైవర్లు పాల్గొన్నారు.