25 August, 2026 | 12:14 AM

Breaking News

భద్రతకు సీసీ కెమెరాలు అత్యంత కీలకం : ఉప్పల్ డిసిపి

24-08-2026 11:09 PM

ఉప్పల్,(విజయక్రాంతి): ప్రజల భద్రతకు సీసీ కెమెరాలు అత్యంత కీలకమని, నేటి పరిస్థితుల్లో అవి సమాజానికి కళ్లులాంటివని ఉప్పల్ డీసీపీ సురేష్ కుమార్ అన్నారు. మల్లాపూర్ డివిజన్ పరిధిలోని చాణిక్యపురి కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ... భద్రతా పరిరక్షణలో సాంకేతికత వినియోగం ఎంతో అవసరమని పేర్కొన్నారు.

కాలనీల్లో ప్రజల సహకారంతో సీసీ కెమెరాల ఏర్పాటు చేయడం ద్వారా నేరాల నియంత్రణ, నేరస్తుల గుర్తింపు, అనుమానాస్పద కదలికల పర్యవేక్షణ మరింతసమర్థవంతంగా జరుగుతుందని డీసీపీ తెలిపారు. పోలీసు–ప్రజల భాగస్వామ్యంతోనే సురక్షిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని ఆయన అన్నారు. ప్రతి కాలనీ, అపార్ట్‌మెంట్‌, వ్యాపార సముదాయం తమ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించిన డీసీపీ, ప్రజలు అప్రమత్తంగా ఉంటూ పోలీసులకు సహకరించాలని కోరారు.

ఏదైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాచారం సీఐ ధనుంజయ్ గౌడ్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ మాన్సింగ్  సబ్ ఇన్స్పెక్టర్ ఫ్రాన్సిస్  నాచారం పోలీస్ సిబ్బంది కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు దశరథ్ జనరల్ సెక్రటరీ కిషోర్ కృష్ణ విజయ దుర్గా పోచమ్మ దేవాలయ చైర్మన్ గంధమల రాములు  మహిళలు, యువత కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన కాలనీ వాసులను డీసీపీ ప్రత్యేకంగా అభినందించారు. కాలనీలో సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల భద్రత మరింత బలోపేతం కావడంతో పాటు ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.