14న సత్యాగ్రహ దీక్ష
- 16న కలెక్టరేట్ల ముట్టడి
- ఫీజు రీయింబర్స్‌మెంట్ ఉద్యమాలకు సీఎం స్పందించాలి
- జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య
ముషీరాబాద్, జూలై 11 (విజయక్రాంతి): 14 లక్షల మంది కాలేజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని, జీవో 9ను రద్దు చేయాలని 18 సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. శనివారం విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ర్యాగ అరుణ్ కు మార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో 150 బీసీ గురుకుల పాఠశాలలు, 120 బీసీ కాలేజీ హాస్టళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్బంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీ గురుకులాల్లో ప్రతి కాలేజీకి 80 సీట్ల నుంచి160 సీట్లకు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ నెల 14న ఇందిరా పార్క్ వద్ద సత్యాగ్రహ దీక్షా, 16న కలెక్టరేట్ల ముట్టడి జరపాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. డిమాండ్లు నెరవేరే వర కు ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరించారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై నెల రోజు లుగా అన్ని విద్యాసంఘాలు ఉద్యమాలు చేస్తున్నా సీఎం పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సి రాజేందర్, బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు జి అనంతయ్య, బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జిల్లపల్లి, అంజి గుజ్జ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.






