18 May, 2026 | 1:28 AM

కేరళం ముఖ్యమంత్రిగా నేడు సతీశన్ ప్రమాణం

18-05-2026 12:30 AM
  1. మంత్రివర్గంలో 21 మందికి చోటు
  2. ఇదేరోజు వారి ప్రమాణం కూడా..

త్రివేండ్రం, మే ౧౭: కేరళం నూతన ముఖ్యమంత్రిగా సోమవారం వీడీ సతీశన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు మూహూర్తం ఖరారు చేస్తూ ఆదివారం సాయంత్రం ప్రకటన విడుదల చేశారు. సామాజిక, ప్రాంతీయ సమీకరణాలను బ్యాలెన్స్ చేస్తూ క్యాబినెట్ జాబితాను రూపొందించినట్లు వెల్లడించారు.21 మందితో తన మంత్రివర్గ సహచరుల జాబితానూ అధికారికంగా ప్రకటించారు. రాష్ట్ర రాజధాని త్రివేండ్రంలోని లోక్‌భవన్‌లో సీఎంతోపాటు మంత్రివర్గంతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

కార్యక్రమానికి ఏఐసీసీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు తదితరులు హాజరుకానున్నారు. రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఆరు దశాబ్దాల తర్వాత ఒకేసారి పూర్తిస్థాయి యూడీఎఫ్ క్యాబినెట్ ప్రమాణ స్వీకారం చేయడం ఇదే తొలిసారి. 21 మంది మంత్రులలో కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రితో కలిపి 11 స్థానాలు దక్కాయి.

అలాగే, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నుంచి ఐదుగురు, కేరళ కాంగ్రెస్ నుంచి ఒకరు, ఆర్‌ఎస్పీ నుంచి ఒకరు, కేరళ కాంగ్రెస్ (జాకబ్) నుంచి ఒకరు, సీఎంపీ నుంచి ఒకరికి మంత్రివర్గంలో చోటు లభించింది. సీనియర్ శాసనసభ్యుడు తిరువాంచూర్ రాధాకృష్ణన్‌ను అసెంబ్లీ స్పీకర్‌గా, షానిమోల్ ఉస్మాన్‌ను డిప్యూటీ స్పీకర్‌గా నియమించాలని యూడీఎఫ్ నిర్ణయించింది.