28 March, 2026 | 3:01 AM

టీఆర్పీ కార్మిక విభాగం అధ్య క్షుడిగా సంకూరి శ్రీనివాస్

28-03-2026 01:02 AM

అధికార ప్రకటన చేసిన తీన్మార్ మల్లన్న

హైదరాబాద్, మార్చి 27(విజయక్రాంతి): ఉప్పల్‌లోని ఎన్‌ఆర్‌బీ బేరింగ్ కంపెనీలో కార్మికులతో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కీలక ప్రకటన చేశారు. పార్టీ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా సంకూరి శ్రీనివాస్‌ని అధికారికంగా ప్రకటిం చారు. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ ఎన్‌ఆర్‌బీ బేరింగ్ కంపెనీ కార్మికులకు ఎలా అండగా నిలిచామో, అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి కార్మికుడికి టీఆర్‌కేవీ అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు.

ఆ బాధ్యతను ముందుకు తీసుకెళ్లేలా సంకూరి శ్రీనివాస్ కృషి చేయాలని సూచించారు. కార్మికుల సమస్యలు కేవలం ఒక కంపెనీకి పరిమితం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నాయని, వాటి పరిష్కారం కోసం సమగ్ర పోరాటం అవసరమన్నారు. టీఆర్‌కేవీ కార్మిక విభాగం ద్వారా ప్రతి కార్మికుడికి భద్రత, గౌరవం, సంక్షేమం కల్పించే దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు.సంకూరి శ్రీనివాస్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో రాష్ట్ర స్థాయి బాధ్యతలు అప్పగించిన మల్లన్నకి, పార్టీ రాష్ట్ర నాయకత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు కృషి చేస్తానన్నారు. టీఆర్‌కేవీ వేదికగా ప్రతి కార్మికుడి హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తాను అని అన్నారు. ఎన్‌ఆర్‌బీ బేరింగ్ కంపెనీలో సాధించిన విజయాన్ని ఉదాహరణగా తీసుకుని రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని ప్రతి పరిశ్రమలో టీఆర్‌కేవీ విజయదుందుభి మోగిస్తామని స్పష్టం చేశారు. కార్మికుల సంక్షేమం కోసం మరింత శక్తివంతమైన ఉద్యమాన్ని నిర్మించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.కార్యక్రమంలో పార్టీ ఉపాధ్యక్షులు ఎల్లబో యిన ఓదెలు యాదవ్, పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బండారపు నర్సయ్య గౌడ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎన్‌ఆర్‌బీ బేరింగ్ కంపెనీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.