28 March, 2026 | 3:04 AM

ఎన్‌ఆర్‌బీ బేరింగ్ కార్మికులకు బీమా

28-03-2026 01:01 AM
  1. ఒక్కో కార్మికుడికి రూ.10 లక్షల యాక్సిడెంట్ ఇన్సూరెన్స్-అదనంగా కీలక బెనిఫిట్స్

మాట నిలబెట్టుకున్న టీఆర్పీ అధినేత తీన్మార్ మల్లన్న

హైదరాబాద్, మార్చి 27(విజయక్రాంతి): ఉప్పల్‌లోని ఎన్‌ఆర్‌బీ బేరింగ్ కంపెనీ కార్మికులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ(టీఆర్పీ) అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మరోసారి తన నిబద్ధతను చాటుకున్నారు.ఎన్నికల సమయంలో గెలిస్తే ప్రతి కార్మికుడికి రూ.10 లక్షల యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ సొంత నిధులతో అందిస్తానని ఇచ్చిన మాటను నేడు కార్యరూపం దాల్చించారు.

కంపెనీ ప్రాంగణంలో కార్మికులు ఏర్పాటు చేసిన సమావేశంలో స్వయంగా ఇన్సూరెన్స్ కార్డులను కార్మికులకు అందజేశారు. మొత్తం 111 మంది కార్మికులకు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, అదనంగా 404 కుటుంబాలకు రూ.1 లక్ష ఫ్యామిలీ ఇన్సూరెన్స్ కూడా కల్పించారు.

యాక్సిడెంట్ వల్ల మరణం జరిగితే రూ.10 లక్షలు, శాశ్వత పూర్తిస్థాయి వైకల్యం లక్ష, తాత్కాలిక వైకల్యం వారానికి రూ.10,000(గరిష్టంగా 100 వారాలు),యాక్సిడెంట్ హాస్పిటలైజేషన్ రూ.3లక్షల వరకు సౌకర్యం కల్పించారు. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా కూడా కార్మికుల భద్రత కోసం ఇలాంటి సమగ్ర ఆలోచనతో, కార్మికుల జీవితం వారి కుటుంబ భద్రతను దృష్టిలో పెట్టుకుని ఇలాంటి స్కీమ్‌లు కార్మిక సంఘాలు తీసుకురాలేదని స్పష్టం చేశారు.చాలా చోట్ల కార్మిక సంఘాలు కేవలం సమస్యలు చెప్పడానికే పరిమితం అవుతున్నాయని,

కానీ వాటికి స్థిరమైన పరిష్కారాలు చూపే దిశగా ముందుకు రావడం చాలా అరుదని పేర్కొన్నారు.టీఆర్పీ కార్మిక విభాగం మాత్రం కార్మికుల కష్టాన్ని అర్థం చేసుకుని, వారి భద్రత కోసం ముందుండి స్వంత నిధులతో ఇలాంటి పథకాలను అమలు చేయడం ఒక కొత్త దిశగా నిలుస్తుందని చెప్పారు. వెంకటయ్య, శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని తెలిపారు.

కార్మిక సంఘాలతో తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్మిక విభాగం తేడా ఏమిటంటే ఇది కార్మికుల కష్టాన్ని దోచుకోదు, వారి కోసం పార్టీ స్వయంగా బాధ్యత తీసుకుని సహాయం అందిస్తుంది. కార్మికుల భద్రత, గౌరవం, సంక్షేమం కోసం మరిన్ని కార్యక్రమాలు త్వరలో తీసుకురాబోతున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో ఎన్‌ఆర్‌బీ బేరింగ్ కంపెనీ కార్మికులు, నాయకులు వెంకటయ్య శ్రీనివాస్, టీఆర్పీ రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.