మురుగు కాలువలకు మోక్షం
కేసముద్రం, ఏప్రిల్ 17 (విజయక్రాంతి): ఇప్పుడే ఇట్లా.. వర్షాకాలంలో ఎట్లా? అని శీర్షికతో కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో డ్రైనేజీ కాలువల దుస్థితిపై ఈనెల 9న విజయక్రాంతి పత్రికలో ప్రచురించిన వార్తా కథనానికి మున్సిపాలిటీ అధికారులు స్పందించారు.
రోడ్డు విస్తరణ పనుల కోసం గతంలో ఉన్న సైడు కాలువలను పూడ్చడంతో ఎక్కడి మురుగునీరు అక్కడే నిలిచిపోయిన ప్రదేశాల్లో మురుగునీరు ముందుకు వెళ్లే విధంగా ప్రత్యేకంగా జేసీబీ యంత్రంతో మట్టిని తొలగించారు. దీనితో పనిచోట్ల మురుగునీరు ముందుకు సాగుతోంది.
శాశ్వత డ్రైనేజీ నిర్మించే వరకు మురుగునీరు నిలువకుండా చర్యలు తీసుకుంటామని, అప్పటివరకు పట్టణ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తాత్కాలికంగా డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తామని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు.






