వసూళ్లు రాక ఆగిన జీతాలు!
జీహెచ్‌ఎంసీలో ట్యాక్స్ టెన్షన్
21 రోజుల్లో వెయ్యి కోట్ల టార్గెట్
ఫీల్డులో లేని నలుగురు బిల్ కలెక్టర్ల సస్పెన్షన్
ప్రశ్నించిన యూనియన్ నేతలపై బదిలీ వేటు
హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి ౨౧ (విజయక్రాంతి): ఆర్థిక సంవత్సరం ముగింపునకు సమయం దగ్గరపడుతుండటంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో పన్ను వసూళ్ల వేట పతాక స్థాయికి చేరింది. నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమవుతున్న సిబ్బందిపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఒకవైపు రూ.వెయ్యి కోట్ల వసూళ్ల టార్గెట్.. మరోవైపు ఖాళీ అయిన ఖజానాతో ఉద్యోగుల జీతాలు కూడా ఆగిపోవడం కార్పొరేషన్లో తీవ్ర ఉత్కంఠకు దారితీస్తోంది.
విధుల్లో నిర్లక్ష్యం వహించిన బిల్ కలెక్టర్లను సస్పెండ్ చేయడంతో పాటు, వారిని సమర్థించిన యూనియన్ నేతలను బదిలీ చేస్తూ అధికారులు తీసుకున్న నిర్ణయం ఇప్పు డు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత ఆర్థి క సంవత్సరానికి సంబంధించి జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్ గిరి కార్పొరేషన్ల పరిధిలో రూ.3 వేలు కోట్ల పన్ను వసూలు చేయా లని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు సుమారు రూ.2 వేల కోట్ల పైచిలుకు వసూలవ్వగా, మార్చి 31 లోపు మిగిలిన రూ.వెయ్యి కోట్లను వసూలు చేయాల్సి ఉంది.
అంటే రాబోయే ౯ రోజుల్లో ప్రతిరోజూ భారీ మొత్తం లో పన్ను వసూలు చేయాల్సి ఉంటుంది. ఇం దుకోసం 145 మంది టాక్స్ ఇన్‌స్పెక్టర్లు, 343 మంది బిల్ కలెక్టర్లకు రోజువారీ టార్గెట్లు ఫిక్స్ చేశారు. పన్ను వసూళ్లలో నిర్లక్ష్యం వహిస్తున్నారన్న సమాచారంతో మల్కాజ్‌గిరి, ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్లు నాచారం, మాల్కాజ్‌గిరి, సరూర్‌నగర్, అల్వాల్ సర్కిళ్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఫీల్డ్ విధుల్లో ఉన్నామని అబద్ధం చెప్పిన నలుగురు బిల్ కలెక్టర్లను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని సస్పెండ్ చేశారు.
ఈ చర్యను ప్రశ్నించిన ఇద్దరు యూనియన్ నేతలను సైతం ఇతర విభాగాలకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కమిషనర్ ఆర్.వి. కర్ణన్ ప్రతిరోజూ టెలీ కాన్ఫరెన్స్ ద్వారా వసూళ్లపై సమీక్ష నిర్వహిస్తూ అధికారులను పరు గులు పెట్టిస్తున్నారు. పన్ను వసూళ్లు మందగించడం జీహెచ్‌ఎంసీ ఉద్యోగుల జీతాలపై నేరుగా ప్రభావం చూపుతోంది. మార్చి 10 దాటి నా మెజారిటీ జోన్లలో సిబ్బందికి జీతాలు అందలేదు.
గతంలో మార్చి నెల చివరలో రోజుకు రూ. 100 కోట్ల వరకు వసూలైన రికార్డులున్నా, ఈసారి పరిస్థితి భిన్నంగా ఉండ టం గమనార్హం. మొండి బకాయిల వసూళ్ల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన వన్ టైమ్ సెటి ల్ మెంట్ పథకం ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. 90 శాతం వడ్డీ రాయితీ ఇచ్చినా, కేవ లం రూ. 155 కోట్లు మాత్రమే వసూలయ్యా యి. ఈ నేపథ్యంలో అధికారులు రూటు మార్చారు. ప్రతి జోన్‌లో టాప్ 200 డిఫాల్టర్ల జాబితా సిద్ధం చేసి, రెడ్ నోటీసులు జారీ చేస్తున్నారు. మార్చి 15 నుంచి మొండి బకాయిలున్న ఆస్తుల సీజింగ్, జప్తు ప్రక్రియను ముమ్మ రం చేయాలని నిర్ణయించారు.




