27 July, 2026 | 2:03 AM

సర్కారు బడి భేష్!

27-07-2026 01:12 AM

విద్యార్థుల నమోదులో మంచిర్యాల జిల్లా టాప్

ప్రైవేటు నుండి ప్రభుత్వ బడికి 3,352 మంది విద్యార్థులు 

ప్రజల విశ్వాసానికి ఇది నిదర్శనం: కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల, జూలై 26 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం 2025-26 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలలో నమోదైన విద్యార్థుల సంఖ్య కంటే 10 శాతం అదనపు విద్యార్థులను నమోదు చేయాలని లక్ష్యంగా నిర్దేశించింది.

2026-27 విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లోకి 10 శాతం అదనపు విద్యార్థుల నమోదు లక్ష్యసాధనలో మంచిర్యాల జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంది. అలాగే ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోకి ఇప్పటికే మూడు వేల పైచిలుకు విద్యార్థులు చేరారు. జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), జిల్లా విద్యాధికారి పి. చంద్రయ్యతో కలిసి యు - డైస్ ఆన్లైన్ పోర్టల్లో విడుదల చేయగా విద్యార్థుల నమోదు నివేదిక బహిర్గతమైంది. 

విద్యార్థుల నమోదులో రాష్ట్రంలోనే మంచిర్యాల జిల్లా ప్రథమ స్థానంలో...

ప్రభుత్వ పాఠశాలల్లో నూతన విద్యార్థులను చేర్పించడంలో మంచిర్యాల జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. గత విద్యా సంవత్సరం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో 43,072 మంది విద్యార్థులు ఉండగా, 2026-27 విద్యా సంవత్సరానికి 47,379 మంది విద్యార్థుల నమోదు లక్ష్యాన్ని నిర్దేశించారు.

పదవ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు, గురుకులాల్లో సీటు సాధించిన మరి కొంతమంది విద్యార్థులు వెళ్లిపోయినప్పటికీ ప్రస్తుతం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 45,350 మంది విద్యార్థులు నమోద య్యారు. గత సంవత్సరంతో పోలిస్తే ఇప్ప టికే 2,278 మంది అదనంగా చేరారు. దీని తో 10 శాతం అదనపు నమోదు లక్ష్యంలో 95.72 శాతం సాధించి మంచిర్యాల జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉండగా రాజన్న సిరిసిల్ల జిల్లా రెండవ స్థానంలో, జగిత్యాల జిల్లా మూడోస్థానంలో ఉన్నాయి.

గత ఏడాదితో పోలిస్తే మెరుగు...

జిల్లా బాస్ మొదటి నుంచి విద్య వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. కలెక్టర్ కుమార్ దీపక్ ఏ మండలానికి వెళ్లినా, ఏ కార్యక్రమ రీత్యా వెళ్లినా ఆ గ్రామంలోని ప్రభుత్వ విద్యాసంస్థలను, ప్రభుత్వ ఆసుపత్రులను తప్పకుండా సందర్శించి పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు. తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు సూచనలను సైతం చేస్తు ప్రోత్సహిస్తుండడంతో గత ఏడాది విడుదలైన పదవ తరగతి, ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలలో రాష్ట్రస్థాయి ర్యాంకులు ప్రభుత్వ విద్యా సంస్థలు సాధించిన విషయం విదితమే.

ఈ ఏడాది సైతం డీఈఓ, డీఐఈఓతో కలిసి కలెక్టర్ విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారించారు. దీనితోనే జిల్లాలోని 275 ప్రభుత్వ పాఠశాలలు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 10 శాతం కంటే అధికంగా విద్యార్థుల నమోదును సాధించాయి. మండలాల వారీగా మందమర్రి, జైపూర్ మండలాలు 100 శాతం లక్ష్యాన్ని చేరుకోగా, హాజీపూర్ 99.91 శాతం, నస్పూర్ 99.76 శాతం, భీమారం 98.24 శాతం, నెన్నెల 98 శాతంతో అత్యుత్తమ పురోగతిని సాధించాయి. మొత్తం 18 మండలాలలో 10 మండలాలు 96 నుంచి 100 శాతం వరకు లక్ష్యాన్ని చేరుకున్నాయి. 

3,352 మంది విద్యార్థులు ప్రైవేటు నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోకి...

మంచిర్యాల జిల్లాలో ప్రైవేటు పాఠశాలలో నుంచి ప్రభుత్వ పాఠశాలలో చేరుతున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఈ నెల 23 నాటి యు - డైస్ గణాంకాల ప్రకారం ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోకి 3,352 మంది విద్యార్థులు చేరారంటే ప్రభుత్వ విద్యపై విద్యార్థుల తల్లిదండ్రుల విశ్వాసానికి నిదర్శనంగా చెప్పవచ్చు.

జిల్లాలోని బెల్లంపల్లి మండలంలో 25 పాఠశాలల్లో 305 మంది విద్యార్థులు ప్రైవేట్ నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పొందగా భీమినీ మండలంలో ఒక పాఠశాలలో 57 మంది, భీమారంలో రెండు పాఠశాలల్లో 135 మంది, చెన్నూర్ లో 14 పాఠశాలల్లో 189 మంది, దండేపల్లిలో ఏడు  పాఠశాలల్లో 154 మంది, హాజీపూర్ లో ఏడు పాఠశాలల్లో 144 మంది, జైపూర్ లో ఆరు పాఠశాలల్లో 89 మంది, జన్నారంలో పది పాఠశాలల్లో 391 మంది, కన్నె పల్లిలో మూడు పాఠశాలల్లో 87 మంది, కాసిపేటలో నాలుగు పాఠశాలల్లో 126 మంది, కోటపల్లిలో నాలుగు పాఠశాలల్లో 49 మంది, లక్సేట్టిపేటలో 11 పాఠశాలల్లో 243 మంది, మంచిర్యాలలో 49 పాఠశాలల్లో 514 మంది, మందమర్రిలో 26 పాఠశాలల్లో 371 మంది, నస్పూర్ లో 26 పాఠశాలల్లో 253 మంది, నెన్నెలలో ఒక పాఠశాలలో 51 మంది, తాండూర్ లో ఆరు పాఠశాలల్లో 153 మంది, వేమనపల్లి మండలంలోని మూడు పాఠశాలల్లో 41 మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలో నుంచి ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు పొందారు. జిల్లావ్యాప్తంగా 18 మండలాల్లో 205 ప్రభుత్వ పాఠశాలలో 3,352 మంది విద్యార్థులు అడ్మిషన్లు తీసుకున్నారు.

ప్రభుత్వ విద్యా సంస్థల్లో చేరేలా ప్రోత్సహిస్తున్నాం... 

ప్రతి ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపా ధ్యాయులు, ఉపాధ్యాయులు తమ పాఠశాలలో చదువు పూర్తి చేసిన విద్యార్థులను తదుపరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో, కళాశాలల్లో స్వయంగా చేర్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. పదవ తరగతి పూర్తి చేసిన బాలికలను కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయా(కేజీబీవీ)లలో చేర్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాం.

జిల్లా స్థాయిలో తరచూ జూమ్ సమీక్షలు నిర్వహించి, మండల విద్యాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్నాం. ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు మారే విద్యార్థుల బదిలీలను వేగంగా ఆమోదించడం, 8 అకాడమిక్ పర్యవేక్షణ బృందాల ద్వారా పాఠశాలల పనితీరును ఎప్పటికప్పుడు మెరుగుపరచడం వంటి చర్యల ఫలితంగానే జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థుల నమోదు గణనీయంగా పెరిగింది.

- పీ చంద్రయ్య, జిల్లా విద్యాశాఖ అధికారి, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)

ప్రభుత్వ విద్యపై నమ్మకంతోనే..

ప్రభుత్వ విద్యపై పెరుగుతున్న నమ్మకంతోనే విద్యార్థుల తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రభుత్వ విద్యా సంస్థల్లో చేర్పిం చేందుకు ముందుకు వస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అత్యు న్నత అర్హతలు కలిగిన ఉపాధ్యాయులతో పాటు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్, ఐసీటీ, కంప్యూటర్ ల్యాబ్లు, ల్యాప్టాప్లు, ట్యాబ్ల ద్వారా డిజిటల్ విద్యను అందిస్తున్నాం. ఈ విద్యాసం వత్సరంలో 82 పాఠశాలల్లో కంప్యూటర్ బోధకులను నియమించాం.

పాఠశాలల్లో మౌలిక వసతులు బలోపేతం చేయడంతో పాటు 8 అకాడమిక్ పర్యవేక్షక బృందాలను ఏర్పాటు చేసి విద్యాప్రమాణాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. బాలికల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు, ఆదర్శ పాఠశాలలో ఆరవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు రెసిడెన్షియల్ విద్యను అభ్యసించేందుకు అవకాశం కల్పిస్తు, అవసరమైన వసతి గృహ, మౌలిక వసతులు అందుబాటులో ఉన్నాయి.  

                   - కుమార్ దీపక్, జిల్లా కలెక్టర్, మంచిర్యాల