22న ‘రైతు భరోసా’ నిధులు
- నర్మెట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో విడుదల చేయనున్న సీఎం
- నేటి నుంచి 22 వరకు నర్మెట్టలో రైతు ఉత్సవాలు
- వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
హైదరాబాద్, మార్చి18 (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా నర్మెట్టలో నిర్మించిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ఈ నెల 22న సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభిచనున్నారని, అదే రోజు 70 లక్షల మంది రైతులకు రైతు భరోసా నిధులు విడుదల చేస్తారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం సందర్భంగా నర్మెట్లలో రైతు ఉత్సవాలను నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు.
గురువారం నుంచి ఈ నెల 22 వరకు కొనసాగుతాయని చెప్పారు. కాగా ఆయిల్ ఫామ్ కంపెనీ ప్రారంభానికి రావాలని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేంద ర్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులందరికీ తుమ్మల బుధవారం అసెంబ్లీ లాబీల్లో ఆహ్వానాలు అందజేశారు. ఈ రైతు మహోత్సవంలో వ్యవసాయం, పశుసంవర్ధక , అనుబంధ రంగాలకు సంబంధించిన మొత్తం 150 స్టాల్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, మత్స్యశాఖల విభాగాలు, విశ్వవిద్యాలయాలు, బ్యాంకులు, ఎఫ్.పి.ఓలు, స్టార్టప్ కంపెనీలు, ప్రైవేట్ సంస్థలు తమ ఆధునిక సాంకేతికతలు, సేవలు, అవకాశాలను రైతులకు పరిచయం చేయనున్నాయన్నారు. నర్మెట్టలో ప్రారంభమవుతున్న ఈ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ రైతులకు మైలురాయిగా నిలవనుందని తెలిపారు.




