పేదలకు నిబంధనలు.. అక్రమ నిర్మాణాలకు అనుమతులా?
- ఇంటి నిర్మాణ అనుమతుల్లో ఇబ్బందులు పెట్టొద్దు
- ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలి
ఆదిభట్ల, ఆగస్టు 29 (విజయక్రాంతి): ఇంటి నిర్మాణ అనుమతుల విషయంలో నిబంధనల పేరుతో పేద, మధ్యతరగతి ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని సీపీఎం రంగారెడ్డి జిల్లా కమిటీ సభ్యుడు డి. కిషన్ అన్నారు. శనివారం రాగన్నగూడలోని జీహెచ్‌ఎంసీ ఆదిభట్ల సర్కిల్ కార్యాలయం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి, డిప్యూటీ కమిషనర్ సత్యనారాయణరెడ్డికి మెమోరాండం అందజేశారు.
కిషన్ మాట్లాడుతూ తొర్రూర్, తుర్కయాంజాల్, కొంగరకలాన్, ఆదిభట్ల పరిధిలో పాత లేఅవుట్లు ఉన్నప్పటికీ ఎల్‌ఆర్‌ఎస్, కన్జర్వేషన్ జోన్, రోడ్డు వెడల్పు వంటి నిబంధనలతో నిర్మాణ అనుమతులు ఇవ్వడం లేదని ఆరోపించారు. 18 అడుగుల కంటే తక్కువ రోడ్డు ఉన్న ప్లాట్ల యజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
సర్వే నంబర్లపై ఆరోపణలు ప్రభుత్వ భూములను ప్రైవేట్ సర్వే నంబర్ల ముసుగులో నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నారన్న ఆరోపణలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కిషన్ డిమాండ్ చేశారు. ఇంజాపూర్ సర్వే నంబర్లు 1, 4, 6, 126, 525, మన్నెగూడ 1, 40, 41, తొర్రూర్ 383, తుర్కయాంజాల్ 53, 312, 323, 328, 631, మునగనూరు 38, 44లో నిర్మాణాలపై సమగ్రంగా పరిశీలించాలని కోరారు.
అధికారులు స్పందించాలి
150 గజాల స్థలాల్లో నాలుగు, ఐదు అంతస్తుల భవనాలు ఎలా నిర్మిస్తున్నారో అధికారులు పరిశీలించాలని అన్నారు. గ్రామకంఠం భూముల్లో అనుమతుల కోసం అధిక ఫీజులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సమస్యలను పరిష్కరించకపోతే సీపీఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.కార్యక్రమంలో ఎం. సత్యనారాయణ, కే. అరుణ్కుమార్, పొడేళ్ల శ్రీనివాసులు, ఏ. భాస్కర్రెడ్డి, కేంసారం సత్యనారాయణ, అరెడ్ల మాధవరెడ్డి, మద్దెల యాదయ్య, సిలువేర్ రాజు, సార్ల రాములు తదితరులు పాల్గొన్నారు.






