11 August, 2026 | 5:15 AM

డ్రైవర్ కుటుంబానికి ఆర్టీసీ భరోసా

11-08-2026 12:00 AM
  1. అంగవైకల్యం పొందిన డ్రైవర్‌కు రూ.50 లక్షల చెక్కు అందజేత
  2. ఉద్యోగుల సంక్షేమానికే ప్రాధాన్యం: ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి

హైదరాబాద్, ఆగస్టు 10 (విజయక్రాంతి): విధి నిర్వహణలో తీవ్రంగా గాయపడి శాశ్వత అంగవైకల్యంతో మంచానికే పరిమితమైన ఆర్టీసీ డ్రైవర్ కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) కొండంత అండగా నిలిచింది. ఉచిత ప్రమాద బీమా పథకంలో భాగంగా బాధిత డ్రైవర్ కుటుంబానికి రూ. 50 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించింది. ఈమేరకు సోమవారం బస్‌భవన్‌లో ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి, బ్యాంకు ప్రతినిధులు ఆ చెక్కును బాధిత డ్రైవర్‌కు అందజేశారు. కరీంనగర్ జిల్లా కోరుట్ల డిపోలో డ్రైవర్‌గా పనిచేసే ఎండీ.మదార్ గత ఏడాది అక్టోబర్ 9వ తేదీ విధి నిర్వహణలో ప్రమాద బారిన పడి కాలు కోల్పోయారు.

ఇంటికి పెద్ద దిక్కు శాశ్వత అంగవైకల్యం బారిన పడడంతో బాధిత డ్రైవర్ కుటుంబానికి ఆర్టీసీ ఆదుకుంది. ఈ సందర్భంగా ఎండీ వై. నాగిరెడ్డి మాట్లాడుతూ తమ తప్పు లేకపోయినా రోడ్డు ప్రమాదాల బారిన పడి ఉద్యోగులు ప్రాణాలు కోల్పోవడం లేదా శాశ్వత అంగవైకల్యానికి గురికావడం అత్యంత విచారకరమన్నారు. ఆర్టీసీ నిరంతరం ఉద్యోగుల సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యతనిస్తుందని, ఆపదలో ఉన్న కుటుంబాలకు సంస్థ ఎల్లప్పుడూ ధైర్యంగా అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.

ఇటువంటి బీమా పథకాలు అత్యవసర సమయాల్లో కుటుంబాలకు ఆత్మస్థైర్యాన్ని, ఆర్థిక భద్రతను ఇస్తాయన్నారు. ఇప్పటివరకు ఈ ప్రమాద బీమా పథకం ద్వారా 27 మంది ఆర్టీసీ సిబ్బంది కుటుంబాలకు ఆర్థిక ప్రయోజనం చేకూరిందని తెలుపుతూ, సంస్థ ఉద్యోగులకు విశేష సేవలందిస్తున్న యూనియన్ బ్యాంక్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు సీహెచ్ వెంకన్న, ఎం. రాజశేఖర్, సాలమన్, ఫైనాన్స్ అడ్వైజర్ విజయపుష్ప, సీపీఎం. ఉషాదేవి,యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.