calender_icon.png 11 February, 2026 | 2:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెల్ట్ షాపులు నిర్వహిస్తే లక్ష జరిమానా..

11-02-2026 12:47:57 AM

  1. బెల్ట్ షాపులు బంద్...

మునిగడపలో గ్రామస్తుల సమష్టి తీర్మానం

జగదేవపూర్: ఫిబ్రవరి 10: సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం మునిగడప గ్రామంలో బెల్ట్ షాపుల నిర్వహణను పూర్తిగా నిలిపివేయాలని గ్రామస్తులు ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ ముచపతి బాలయ్య, ఉప సర్పంచ్ మామిండ్ల కిషన్ యాదవ్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామ సభలో విస్తృత చర్చ అనంతరం మద్యనిషేధ తీర్మానాన్ని ఆమోదించారు.

గ్రామంలో బెల్ట్ షాపుల వల్ల యువత చెడు అలవాట్లకు లోనవడం, కుటుంబాల్లో గొడవలు పెరగడం, శాంతిభద్రతలకు విఘాతం కలగడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని గ్రామస్తులు, యువజన సంఘాల సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో మద్యం విక్రయాలపై పూర్తి నిషేధం విధించాలని, అక్రమ విక్రయాలను ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా గ్రామస్తులు ఆమోదించిన మద్యనిషేధ తీర్మానాన్ని ఎక్సైజ్ అధికారులకు అందజేశారు. గ్రామంలో ఎవరైనా బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామాభివృద్ధి, సామాజిక ప్రశాంతత కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని గ్రామ పెద్దలు తెలిపారు.గ్రామ సర్పంచ్ బాలయ్య , ఉప సర్పంచ్ మామిండ్ల కిషన్ యాదవ్, వార్డు సభ్యులు బాలస్వామి, గుర్రం శ్రీధర్, జగదీష్, చందు, సలేంద్రి కరుణాకర్, మన్నే శైలజ కవిత కారింగుల నాగమణి కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు కూరాడపు సతీష్ గ్రామస్తులు, యువకులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.