calender_icon.png 14 February, 2026 | 2:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘పుర’ంలో గులాబీ డీలా!

14-02-2026 12:28:51 AM

బీఆర్‌ఎస్‌కు కలిసిరాని ఫలితాలు

  1. నామమాత్ర వార్డులకే ప్రతిపక్షం పరిమితం
  2. ప్రచారంలో వెనుకబాటే కారణమని అభిప్రాయాలు
  3. భవిష్యత్ ఎన్నికలపైనా ప్రభావం 
  4. ఓటర్ల హెచ్చరికా.. లోతైన మార్పులకు సంకేతమా?
  5. సమీక్షించుకోకపోతే సవాళ్లను ఎదుర్కోక తప్పదా..

హైదరాబాద్, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి) : తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు ప్రాంతీయ రాజకీయాల్లో కీలక పరిణామాలకు దారి తీసింది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్‌కు ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడం ప్రస్తుతం చర్చనీ యాంశంగా మారింది. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీల్లో 2500లకు పైగా వార్డుల్లో ఎన్నికలు జరిగా యి.

అందులో అధికార కాంగ్రెస్ 1300లకుపైగా వార్డుల్లో గెలుపొందగా బీఆర్‌ఎస్ 700-800 వార్డులకే పరిమితమైంది. ఈ వార్డులతో కేవలం 15 మున్సిపల్ పీఠాలను మాత్ర మే సాధించింది. దీంతో రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన తర్వాత పార్టీ క్యాడర్ మునుపటి ఉత్సాహంతో పనిచేయలేదనే అభిప్రాయం బలపడుతోంది. గతంలో అధికా ర బలం, స్థానిక సంస్థలపై పట్టు బీఆర్‌ఎస్‌కు కలిసివచ్చేది. ఇప్పుడు అదే బలం తగ్గడంతో కేడర్‌లో  స్పష్టమైన మార్పు కనిపించిందని విశ్లేషకులు చెబుతున్నారు.

అభ్యర్థుల ఎంపికలో చోటుచేసుకున్న అసంతృప్తి అనేక మున్సిపాలిటీల్లో బీఆర్‌ఎస్‌కు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. కొన్ని చోట్ల పార్టీ అంతర్గత సమన్వయం పూర్తిగా దెబ్బతిన్నట్లు స్థానిక నేతలే ఒప్పుకుంటు న్నారు. దీనికి తోడు బీజేపీ కొన్ని పట్టణాల్లో తన ఓటు శాతాన్ని నిలబెట్టుకోవడం లేదా పెంచుకోవడం బీఆ ర్‌ఎస్‌కు నష్టంగా మారింది. త్రిముఖ పోరులో స్వల్ప ఓట్ల తేడాలు కూడా ఫలితాలను ప్రభావితం చేశాయి. ప్రత్యర్థుల మధ్య ఓటు చీలిక కంటే, బీఆర్‌ఎస్ ఓటు బ్యాంక్‌లో చీలిక ఎక్కువగా కనిపించిందనే అభిప్రాయం ఉంది. 

చివరి రోజుల్లో ప్రచారం... 

రాష్ట్రంలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన తర్వాత కూడా కొద్ది రోజులు బీఆర్‌ఎస్ నిర్లక్ష్యంగా వ్యహరించిందని వాదన కూడా ఉంది. ప్రచారం మొదట్లోనే క్షేత్రస్థాయి కేడర్‌ను పూర్తిగా పట్టించుకొని జిల్లాలు, మున్సిపాలిటీల వారీగా ప్రచారం కొనసాగించి ఉంటే బాగుండేదని కార్యకర్తల నుంచే వినిపిస్తున్నది. చివరి ఐదు రోజుల్లో ఒక్కసారిగా కేటీఆర్, హరీశ్‌రావు రంగంలోకి దిగినా సమయం సరిపోలేదన్న చర్చ జరుగుతున్నది.

మున్సిపాలిటీల సంఖ్య ఎక్కువగా ఉండటంతో కీలక మున్సిపాలిటీలను కూడా పూర్తిగా కవర్ చేయలేని పరిస్థితి ఎదురైంది. ఎన్నికల ప్రచారానికి ఐదు రోజులే గడువు ఉందన్న సమయంలో కేటీఆర్, హరీశ్‌రావు స్పందించి జిల్లాల బాట పట్టారు. అప్పటివరకు కేవలం తమ తమ నియోజకవర్గాలకే పరిమితం అయ్యారు. కేవలం సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లోనే రివ్యూలు చేశారు. అయితే.. పార్టీని నడిపించాల్సిన వీరు కేవలం తమ సొంత నియోజకవర్గాలకే పరిమితం కావడంపై విమర్శలు వచ్చాయి.

దాంతో వెంటనే స్పందించి రాష్ట్రవ్యాప్తంగా తలా కొన్ని మున్సిపాలిటీలను ఎంచుకొని షెడ్యూల్ రెడీ చేసుకొని ప్రచారానికి దిగారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రధానంగా స్థానిక సమస్యలు, వార్డు స్థాయి నాయకత్వం, నిరంతర కేడర్ కదలిక ఇవే ఫలితాన్ని నిర్ణయిస్తాయి. కానీ.. ఫార్ములాను పక్కనపెట్టి చివరి నిమిషంలో హడావిడితో గెలవచ్చన్న భ్రమే బీఆర్‌ఎస్‌ను ఇబ్బందుల్లోకి నెట్టిందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.

భవిష్యత్ రాజకీయాలపై..

పార్టీ అధినేత కేసీఆర్ ప్రచారానికి దూరంగా ఉండటం కూడా కొంత నష్టం చేకూర్చిందని అభిప్రాయం వ్యక్తమవుతుంది. స్థానిక నాయకులపై ఆధారపడడం వ్యూహాత్మకంగా సరైన నిర్ణయమా? అన్న చర్చ కూడా సాగుతోంది. మున్సిపల్ ఫలితాలు భవిష్యత్ ఎన్నికలపై ప్రభావం చూపుతాయనే భావన రాజకీయాల్లో ఉంది. పట్టణ ఓటరు మూడ్ మారుతున్న సంకేతాలను బీఆర్‌ఎస్ సీరియస్‌గా తీసుకుంటే పునర్వవ్యవవస్థీకరణకు ఇది అవకాశమవుతుంది.

లేదంటే ఇదే ధోరణి రాబోయే ఎన్నికల్లో కూడా ప్రతిఫలించే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. బీఆర్‌ఎస్‌కు ఈ ఫలితాలు ఒక హెచ్చరిక మాత్రమేనా? లేక లోతైన మార్పుల సంకేతమా? అన్నది పార్టీ అంతర్గత సమీక్షలపై ఆధారపడి ఉంటుంది. కేడర్ పునరుద్ధరణ, పట్టణ అజెండాపై స్పష్టత, అంతర్గత ఐక్యత వంటి అంశాలు ముందున్న సవాళ్లను ఎదుర్కొనే ప్రధాన ఆయుధాలుగా మారనున్నాయి.