10 July, 2026 | 2:09 PM

గచ్చిబౌలి ఫ్లైఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం: యువతి మృతి

10-07-2026 01:14 PM

శేరిలింగంపల్లి,జులై 10 (విజయక్రాంతి): గచ్చిబౌలి ఫ్లైఓవర్(Gachibowli flyover) వద్ద భారీ వాహనాల నిర్లక్ష్యం వల్ల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువతి స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయింది. మరొక మహిళ తీవ్రంగా గాయపడింది.పోలీసు సమాచారం ప్రకారం, ట్రీబుల్ ఐటీ నుంచి అంజయ్య నగర్ వైపు వెళ్తున్న ఆటోను వెనుక నుంచి వాటర్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో మల్లం భవానీ (23) అనే యువతి అక్కడికక్కడే మృతి చెందగా, ఎస్. సుభాషిణి (30) తీవ్ర గాయాలపాలైంది. గాయపడిన సుభాషిణిని హుటా హుటిన హిమగిరి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

బాధితుల తరపున ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని బాధితులు ఆరోపించారు. పోలీసులు ట్యాంకర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ప్రాథమిక విచారణలో ట్యాంకర్ అధిక వేగంలో వెళ్తూ ఆటోను వెనుక నుంచి ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఫ్లైఓవర్‌పై ట్రాఫిక్ నియమాల అమలు, వాహనాల వేగ నియంత్రణపై అధికారులు దృష్టి పెట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవలి కాలంలో గచ్చిబౌలి, మాధాపూర్, కొండాపూర్ ప్రాంతాల్లో ఇలాంటి ప్రమాదాలు పెరుగుతున్నాయి.