తురకలపల్లిలో రాతిచిత్రాలు
- మధ్యరాతియుగం నుంచి చారిత్రకయుగం దాక రాతిచిత్రాల గాథలు
- బొమ్మలలో మన పురాతనచరిత్ర
నాగర్‌కర్నూలు జిల్లా చారగొండ మండలంలోని తురకలపల్లి గ్రామం బయట ఉన్న చిన్నగుట్ట గుహలో చిత్రిత శిలాశ్రయం ఉన్నది. ఉత్తర అక్షాంశం 16.686861 డిగ్రీలు, తూర్పురేఖాంశం 78.658680డిగ్రీలపై నెలవైన ఈ రాతిచిత్రాల తావును కొత్త తెలంగాణ చరిత్రబృందం సభ్యులు యాదేశ్వర్ దంతేటికర్, కలగోని కిరణ్ కుమార్‌గౌడ్ గుర్తించారు. వీటిని పరిశీలించినపుడు ఎరుపు, తెలుపు, నలుపు రంగులలో గీసిన ఈ రాతిచిత్రాలు వివిధ రాతియుగాలకు చెందినవని కొత్త తెలంగాణ చరిత్రబృందం సలహాదారులు, రాతిచిత్రాల నిపుణుడు బండి మురళీధర్‌రెడ్డి నిర్ధారించారు.
ఎరుపురంగు రాతిచిత్రాలు..
గుర్తించడానికి వీలుపడని ఒక పెద్ద జంతువు, చిన్న సరీసౄపం, రెండు గీతలు క్రాస్ అయి ఉండటం, పొడవైన కొమ్మువంటి, ఎముకలవంటి ఆకారాలు, మసకబారిన త్రిభుజాలు, అనిశ్చిత డిజైన్లు, ఇతర గీతలు, మానవ ఆకృతి?గా ఉన్నాయి. ఇవన్నీ మెసోలిథిక్ కాలానికి చెందిన రాతిచిత్రాలు. ఎరుపు రంగు గీతలు కొన్నిసార్లు ఒకదానిపై ఒకటి అధ్యారోపణం చేయబడి ఉన్నాయని కొత్త తెలంగాణ చరిత్ర బృందం వారు తెలిపారు.
తెలుపురంగు రాతిచిత్రాలు..
కొమ్ములుగల మూపురపుటెద్దు, మూపురంలేని కొమ్ముల ఎద్దు, 10 స్పోక్స్(ఆకులు)గల అలంకరణ వృత్తం గలవి ఉన్నాయి. ఇవి నియోలిథిక్ కాలానికి చెందినవి. కొన్ని నలుపురంగు రాతిచిత్రాల పైన కూడా తెలుపురంగు వేయబడి ఉంది. ఇది తర్వాతకాలంలో చేయబడి ఉండాలని కొత్త తెలంగాణ చరిత్ర బృందం వెల్లడించింది.
నలుపు రంగు రాతిచిత్రాలు..
వృత్తాలు, లోపల ‘ఎక్స్’ గుర్తు ఉన్న డబుల్ లైన్ దీర్ఘచతురస్రం, 8 గీతలు, డాట్స్ ఉన్న అర్ధవృత్తాకార అలంకరణ మోటిఫ్‌తోపాటు బయట చిన్నగీతలు, సాధారణ జంతువులు,- కొమ్ములు లేని మూపురపు జంతువు, పొడవైన మెడతోపాటు పొడవైన తోక ఉన్న 6 కాళ్ల జంతువులు, పొడవైన తోకతో 4 కాళ్ల జంతువులు, కుడి చేతిలో కత్తి పట్టుకున్న మానవ ఆకృతులు, కుడి చేతిలో కత్తి పట్టుకుని 4 కాళ్ల గుర్రంవంటి జంతువు మీద సవారీ చేస్తున్న మనిషి, సరిగా కనిపించని ఏనుగురూపం, పడుకున్న స్థితిలో కనిపించే అనిశ్చిత రూపాలు, వాటి పైన ఆయుధంతో మనిషి చిత్రం ఉన్నాయి. ఈ రాతిచిత్రాలలో సౌష్టవం లేదు. అసమాన చిత్రణ ఉంది. ఇవి చారిత్రక కాలానికి చెందిన రాతి చిత్రాలు అని కొత్త తెలంగాణ చరిత్ర బృందం వివరించింది.
గ్రూవ్స్..
ఇక్కడ పరుపుబండల మీద కనిపిస్తున్న లోతైన నూరుడుగుంటలు కొత్తరాతియుగం రాతిపనిముట్లు పదును పెట్టుకోవడానికి పనికొచ్చేవి. ఒకేచోట వివిధకాలాలకు చెందిన రాతిచిత్రాలు లభించడం వేర్వేరు కాలాలకు చెంది న పురామానవులు ఈ తావును ఆవాసంచేసుకుని జీవించారని, తమ జీవనసంస్కృతిని ప్రతిబింబించే చిత్రాలను గీశారని, ఈ చిత్రాలే మనకు వారు అందించిన చరిత్రపుటలని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్, శ్రీరా మోజు హరగోపాల్ అభిప్రాయపడ్డారు. ఈ క్షేత్రపరిశోధనలో కలగోని కిరణ్ కుమార్‌గౌడ్, యాదేశ్వర్ దంతేటికర్, సభ్యులు, కొత్త తెలంగాణ చరిత్ర బృందం పాల్గొన్నారు.




