వేదాలు వల్లించే పండితులను కూడా వేధించడమేనా?: హరీశ్ రావు
హైదరాబాద్: తెలంగాణలోని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం(Yadadri Sri Lakshmi Narasimha Swamy Temple), బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయం, భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం తదితర ప్రముఖ దేవాలయాల్లో జరుగుతున్న వేద పండితుల నియామకాల్లో స్థానికులకు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తూ తెలంగాణ వేద పండితుల ప్రతినిధులు మాజీ మంత్రులు హరీశ్ రావు, శ్రీనివాస్ గౌడ్ ను కలిసి వినతిపత్రం అందించారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో వేదాలు వల్లించే వేద పండితులను కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వేధించడం బాధాకరమన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా రాష్ట్రంలోని దేవాలయాల్లో స్థానిక వేద పండితులకు దక్కాల్సిన అవకాశాలు ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి వెళ్తున్నాయన్న ఆరోపణలు అత్యంత ఆందోళనకరమని పేర్కొన్నారు. తెలంగాణ యువత, స్థానిక వేద పండితుల హక్కులను పరిరక్షించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతని స్పష్టం చేశారు.
తెలంగాణ దేవాలయాల్లో భర్తీ చేసే వేద పండితుల పోస్టుల్లో స్థానికులకు ప్రాధాన్యం కల్పించాలని, స్థానిక రిజర్వేషన్ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. నియామక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉండాలని, ఇంటర్వ్యూ బోర్డుల్లో కూడా తెలంగాణకు చెందిన అర్హులైన వేద పండితులకే అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వెనుక స్థానికుల హక్కుల పరిరక్షణే ప్రధాన లక్ష్యమని, అలాంటి రాష్ట్రంలో స్థానిక వేద పండితులకు అన్యాయం జరిగే పరిస్థితి ఉండకూడదన్నారు. తెలంగాణకు చెందిన అర్హులైన వేద పండితులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని నియామక ప్రక్రియను సమీక్షించి, స్థానికులకు ప్రాధాన్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ తరుపున ఇరువురు నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.






