12 April, 2026 | 2:04 AM

ఇప్పపువ్వుల లడ్డు.. ఆరోగ్యం చాలామెండు!

12-04-2026 12:00 AM

ఏజెన్సీలో తయారీ రాష్ట్ర రాజధానిలో అమ్మకం

 బండారి లక్ష్మీనర్సయ్య,

ఉట్నూర్ (విజయక్రాంతి) : ఇప్ప పువ్వు లడ్డు అత్యంత బలవర్ధకమైన, సాంప్రదాయ ఆరోగ్యకరమైన స్వీట్. ఈ లడ్డూలో సహజ సిద్ధమైన తీపితోపాటు ఇనుము(ఐరెన్), ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. గర్భిణులకు, రక్తహీనత ఉన్న వారికి ఇది చాలా ప్రయోజనకరం. ఈ లడ్డూలో ఔషధగుణాలు కూడా పుష్కలంగా ఉంటంతోపాటు శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

ప్రతిరోజూ ఈ లడ్డు తినడం వల్ల 45 రోజుల్లో శరీరంలో రక్తశాతం పెరుగుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. అంతేకాదు రక్తహీనత, నీరసం, మొకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుందని సూచిస్తున్నారు. దీంతో ఆదివాసీ గిరిజన మహిళలు తయారు చేస్తున్న ఇప్ప పువ్వుల లడ్డూలకు ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలోని అడవి ప్రాంతంలో వేసవిలో 45 రోజులపాటు మాత్రమే దొరికే ఇప్పపువ్వులను ఆదివాసి, గిరిజనుల ద్వారా సేకరించి, లడ్డూలు తయారీ సంఘం ఆధ్వర్యంలో కొనుగోలు చేస్తున్నారు.

ఎండిన ఇప్ప పూలు, బెల్లం, వేరుశెనగ, నువ్వులు, నెయ్యి, డ్రై ఫ్రూట్స్‌తో పాటు సువాసన కోసం యాలాకులను కలిపి, మిశ్రమంగా చేసి ఇప్పపూల లడ్డూలను తయారు చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్‌లో ప్రస్తావించిన తర్వాత, ఈ లడ్డూలకు ప్రాచూర్యం విపరీతంగా పెరిగింది. ఇది కేవలం తీపి పదార్థం మాత్రమే కాదు, ఒక ఆరోగ్యకరమైన ‘సూపర్ ఫుడ్’గా, శరీరానికి తక్షణమే శక్తినిచ్చే సంప్రదాయకమైన, ఆరోగ్యకరమైన స్వీట్‌గా, మెండుగా ఔషధ గుణాలున్న లడ్డూగా ప్రసిద్ధి చెందుతోంది.

ఈ లడ్డూలను ఆదిలాబాద్ జిల్లాలో విక్రయించడంతోపాటు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని శిల్పారా మంలో ఇందిరా శక్తి భవన్‌లో అమ్ముతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 124 ఆశ్రమ పాఠశాలల విద్యార్థుల కోసం ఇప్పపు లడ్డూలను సరఫరా చేస్తున్నారు.

జిల్లాలోని ఆశ్రమ పాఠశాలలకు ప్రతివారం 39 క్వింటాళ్ల ఇప్పపూల లడ్డూలను సరఫరా చేస్తున్నట్లు అధ్యక్షురాలు కుంర్రా బాగుబాయి తెలిపారు. 17 మందిఆదివాసి గిరిజన మహిళలు ఇప్ప లడ్డూలను తయారు చేస్తూ.. ఉపాధి పొందుతున్నారు. అంతేకాదు మంచి పోషకాలు గల ఇప్పపూల లడ్డూలను తయారు చేస్తూ ప్రజల ఆరోగ్యానికి దోహోదపడుతున్నారు. 

ఇప్ప లడ్డు.. ఆరోగ్యానికి రక్ష

ఆదివాసి గిరిజనులు వేసవికాలంలో తెల్లవారకముందు అడవికి వెళ్లి సేకరిస్తున్న ఇప్పపువ్వు ప్రజల ఆరోగ్యానికి రక్షణగా నిలుస్తుంది. గిరిజన మహిళలు తయారు చేసే ఇప్పపువ్వు లడ్డూలను తింటే శరీరానికి ఎంతో తక్షణ శక్తి లభిస్తుంది. అంతేకాదు ఇప్ప పువ్వును నేరుగా తింటే బీపీ, షుగర్ వ్యాధులను అరికట్టడంతో పాటు రక్తనాళాలను కూడా శుభ్రం చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గిరిజనులు తమ దేవతలకు నైవేధ్యంగా విప్పపర్క నూనెలతో గారెలను చేసి, దేవతలకు సమర్పిస్తారు.

కలెక్టర్ దివ్య దేవరాజన్ ప్రోత్సావం.. లడ్డూల తయారీకి శ్రీకారం

అదిలాబాద్ జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహించిన, ప్రస్తుత పంచాయతీరాజ్ కమిషనర్ దివ్య దేవరాజన్ ఇప్పపువ్వుతో ప్రజలకు ఆరోగ్యంగా ఎంతో మేలు జరుగుతుందని గుర్తించారు. ఇప్పపూలు తినడంతో ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుందని సంకల్పించారు. ఇప్పపువ్వు లడ్డూలను తయారుచేసి ప్రజలకు అందిస్తే కొంతమేరకు ఆరోగ్యం మెరుగుపడుతుందని భావించి, ఇందుకు ఆదివాసి గిరిజన మహిళలను ఎంపిక చేశారు.

ఎంపిక చేసిన మహిళలకు ఇప్ప పూలతో లడ్డూలు తయారీపై శిక్షణ ఇప్పించారు. లడ్డూల తయారీకి ఇప్ప పూలను సేకరించేందుకు, ఇందుకు కావలసిన అన్ని ఏర్పాట్లను చేసుకునేందుకు ప్రభుత్వపరంగా ఆర్థిక సాయం అందించారు. దీంతో ఇప్ప పూల లడ్డూలను తయారీ చేస్తూ విక్రయిస్తున్నారు.

ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఇప్ప పూల చెట్లు తగ్గిపోతున్నాయని కొంతమంది గిరిజనులు దివ్య దేవరాజన్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో హరితహారం నర్సరీలో ఇప్ప పూల మొక్కలను పెంచాలని సూచనలు చేశారు. నర్సరీలో పెంచిన మొక్కలను చేనులో నాటే విధంగా మొక్కల సరఫరాను నాగోబా ఆలయంలో పంపిణీ చేయించారు. కలెక్టర్‌గా పంపిణీ చేసిన మొక్కలను గిరిజనులు చేను గట్లపై నాటుకున్నారు. అవి పెరుగుతున్నాయి..

17 మంది మహిళలకు ఉపాధి

12 మంది స భ్యులతో ఏర్పడిన సంఘం ద్వారా 17 మందికి ఉపాధి కల్పిస్తున్నామని బాగుబాయి తెలిపింది. ప్రతి మహి ళకు నెలకు రూ.15 వేలు చెల్లిస్తున్నామన్నారు. ఉట్నూర్‌లో తయారుచేసిన ఇప్ప పూల లడ్డూలను రాష్ట్ర రాజధానిలోని శిల్పారామంలోని ఇందిరా శక్తి భవన్‌లోని 41 గదిలో విక్రయి స్తున్నా మని తెలిపారు. ఇక్కడ తయారుచేసిన లడ్డూలను ప్రతిరోజూ పంపించి విక్రయిస్తున్నామని ఆమె తెలిపింది. గ్రామాల్లో రూ.100 చొప్పున కేజీ ఇప్పపువ్వును ప్రస్తుతం సేకరిస్తున్నామని ఆమె తెలిపారు.

- కుంర్రా బాగుబాయి, అధ్యక్షురాలు