రోడ్డు భద్రత అందరి బాధ్యత..!
- జిల్లా రవాణా శాఖ అధికారి వి.లక్ష్మణ్ వాహనదారులతో ప్రతిజ్ఞ
రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): రోడ్డుపై ప్రయాణించే ప్రతి వాహనదారుడు సామాజిక బాధ్యతగా భద్రత చర్యలు తీసుకోవాలని జిల్లా రవాణా శాఖ అధికారి వి.లక్ష్మణ్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ ఆఫీసులో సోమవారం ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక, 99 రోజుల కార్యక్రమంలో భాగంగా వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. వాహనదారులందరూ భద్రత ప్రమాణాలను పాటించాలన్నారు. హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ పెట్టుకోవడం, నిదానంగా ప్రయాణించడం, రోడ్డు భద్రత సూచనలు పాటించాలన్నారు.
సురక్షిత ప్రయాణమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు.. ప్రమాద రహిత సమాజం కోసం కృషి చేయాలని లక్ష్మణ్ కోరారు. ప్రాణాలు అమూల్యమైనవని, ప్రమాదాల నివారణను సామాజిక బాధ్యతగా స్వీకరించాలన్నారు. ఎవరికివారు జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలు జరగవని, మద్యం తాగి వాహనాలను నడపవద్దని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఆఫీసుకు వచ్చిన వాహనదారులతో ప్రతిజ్ఞ చేయించారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.




