అకాల వర్షంతో రైతన్న విలవిల...
జన్నారం, (విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో అకాల వర్షాలకు రైతులు విలవిలలాడుతున్నారు. మూడు రోజులుగా మబ్బులతో కూడిన వాతావరణం ఉండటం, ఒక్క సారిగా ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తుండటంతో రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు. మరోవైపు ఆరిన ధాన్యం కుప్పలుగా పోసి తూకం ఎప్పుడు పెడతారా అని ఎదురు చూస్తున్న రైతులకు వానలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఆరిన ధాన్యానికి తూకం వేసి మిల్లులకు పంపించడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. కాంటా చేసిన బస్తాలు సైతం ఎండకు ఎండుతూ, వానకు తడుస్తున్నా వాటిని తరలించేందుకు మోక్షం కలుగడం లేదు. రైతన్న పొద్దున లేచికాడి నుంచి పొద్దుగూకే దాక కళ్లాల్లోనే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. ఓ వైపు ఎండలు, మరో వైపు వానలు రైతన్నను అతలాకుతలం చేస్తుంటే రైతుల కష్టాలను పట్టించుకునే నాథుడే మండలంలో కరువయ్యాడు.
తడిసి ముద్దయిన వరి ధాన్యం
గురువారం కురిసిన భారీ వర్షాలకు జన్నారం మండలంలోని పొనకల్, అక్క పెళ్లి గూడెం, కిష్టాపూర్, దేవునిగూడెం, కామన్ పల్లి, కవ్వాల్, మందపల్లి, చింతగూడ, రోటి గూడ గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో పోసిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. రైతులకు పూర్తిస్థాయిలో కవర్లు అందలేదు. అధికారులు, రాజకీయ నాయకులు చోద్యం చూస్తున్నారు తప్ప రైతులకు సహాయక చర్యలు తీసుకోవట్లేదు. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచుతుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.






