5 April, 2026 | 6:58 AM

రిజ్వి విధ్వంసం

05-04-2026 01:45 AM

ఢిల్లీ చేతిలో ముంబై చిత్తు

మరోసారి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్

చేతులెత్తేసిన ముంబై బౌలర్లు 

51 బంతుల్లో 90 చేసిన రిజ్వి

ముంబై ఇండియన్స్‌కు ఢిల్లీ షాకిచ్చింది. కెప్టెన్ పాండ్యా దూరమవడం.. బ్యాటర్లు అనుకున్న స్థాయిలో రాణించకపోవడంతో పాటు  ఢిల్లీ ఇంపాక్ట్ ప్లేయర్ సమీర్ రిజ్వి మరోసారి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడడంతో ముంబై చిత్తుగా ఓడిపోయింది.  ఆరంభంలో మరోసారి తడబడినా రిజ్వి విధ్వంసంతో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంటే.. ముంబై తొలి ఓటమిని రుచి చూసింది.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4 : హోంగ్రౌండ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఢిల్లీ అదే జట్టుతో బరిలోకి దిగితే.. ముంబై మాత్రం మూడు మార్పులు చేసిం ది, అనారోగ్యంతో హార్థిక్ దూరమవగా సూ ర్యకుమార్ కెప్టెన్సీ అందు కున్నాడు. హార్థిక్ స్థానంలో దీపక్ చాహర్, బౌల్ట్ ప్లేస్ లో కార్బిన్ బోస్చ్, ఘజన్ ఫర్ స్థానంలో శాం ట్నర్ జట్టులోకి వచ్చారు. ముంబై ఇండియన్స్‌కు ఈ సారి సరైన ఆరంభం దక్కలేదు.

రికల్టన్ (9), తిలక్ వర్మ డకౌటయ్యారు. అ యితే రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ ఆదుకున్నారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 53 పరుగులు జోడించారు. ధాటిగా ఆడిన రోహిత్ 26 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్ తో 35 రన్స్ చేశాడు. అటు సూర్యకుమార్ కూడా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 36 బంతు ల్లో 51 (3 ఫోర్లు, 2 సిక్సర్లు) పరుగులకు వెనుదిరిగాడు. రూథర్ ఫర్డ్ (5) నిరాశపరిచాడు. సూర్యకుమార్ ఔటైన తర్వాత ముం బై స్కోరు వేగం తగ్గింది.

కనీసం 150 పరుగులైనా చేస్తుందా అనుకుంటున్న దశలో నమన్ ధీర్, శాంట్నర్ రాణించారు. నమన్ ధీర్ 21 బంతుల్లో 28 , శాంట్నర్ 18 పరుగులు చేయగా.. చివర్లో బోస్చ్ (11) పర్వాలేదనిపించాడు. దీంతో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 162 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లం తా కట్టుదిట్టమైన బౌ లింగ్‌తో ఆకట్టుకున్నారు. ముకేశ్ కుమార్ 2, ఎంగిడి, అక్షర్ పటేల్, విప్రజ్, నటరాజన్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

ఛేజింగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ మరోసారి తడబడింది. కేవలం 7 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. కేఎల్ రాహుల్ (1) మరోసారి నిరాశపరిస్తే.. నితీశ్ రాణా డకౌటయ్యాడు. ఈ దశలో ఓపెనర్ నిస్సాంక, ఇంపాక్ట్ ప్లేయర్ సమీర్ రిజ్వీ ఆదుకున్నారు. నిస్సాంకా దూకుడుగా ఆడుతూ పవర్ ప్లేలో స్కోర్ పెంచాడు. ఈ లంక క్రికెటర్ 30 బంతుల్లో 44 ప రుగులు చేయగా.. అటు రిజ్వి మరోసారి విధ్వంకర ఇన్నింగ్స్‌తో రెచ్చిపోయాడు. గత మ్యాచ్ తరహాలోనే భారీ షాట్ల తో విరుచుకుపడ్డాడు. ముంబై బౌలర్లలో బుమ్రాను తప్పిస్తే ఎవ్వరినీ లెక్క చేయకుండా సిక్సర్లు, ఫోర్లు బాదేశాడు.

నిస్సాంక, రిజ్వీ 66 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పా రు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ బాదిన రిజ్వీ తర్వాత మిల్లర్ తో కలిసి మరింత దూకుడుగా ఆడాడు. మిల్లర్, రిజ్వి కలిసి 78 పరుగులు జోడించారు. సెంచరీ చేసేలా కనిపించిన రిజ్వీ 51 బంతుల్లో 90 (7 ఫోర్లు, 7 సిక్సర్లు) రన్స్ దగ్గర ఔటయ్యాడు. అప్పటికే ఢిల్లీ విజయానికి చేరువైంది. తర్వాత మిల్లర్, స్టబ్స్ విజయాన్ని పూర్తి చేశారు. ఢిల్లీ మరో 11 బంతులు మిగిలుండగానే టార్గెట్ అందుకుంది. ముంబై బౌలర్లలో బుమ్రా తప్పిస్తే మిగిలిన వారంతా విఫలమయ్యారు. 

స్కోరు బోర్డు 

ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ : 162/6 (సూర్యకుమార్ 51, రోహిత్ శర్మ 35, నమన్ ధీర్ 28, ముకేశ్ కుమార్ 2/26, ఎంగిడి 1/34 , అక్షర్ పటేల్ 1/22 )

ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ : 164/4(18.1 ఓవర్లు) ( సమీర్ రిజ్వి 90, నిస్సాంక 44, మిల్లర్ 21 నాటౌట్, బుమ్రా 1/20, శాంట్నర్ 1/22, బోస్చ్ 1/39)