ప్రపంచ సెయిలింగ్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించిన రిశ్విత
సన్మానించి అభినందించిన షబ్బీర్ అలీ
కామారెడ్డి, ఆగస్టు 16 (విజయక్రాంతి): ప్రపంచ సెయిలింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఇటలీలో జరిగిన పోటీల్లో రజత పతకం సాధించి దేశానికి, తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిన రిశ్విత సుంచనకోటను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ఆదివారం ఘనంగా సన్మానించారు.
కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రిశ్వితను శాలువాతో సత్కరించి, అభినందనలు తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభను చాటుతూ రజత పతకం సాధించడం ఎంతో గర్వించదగ్గ విషయమని షబ్బీర్ అలీ పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా బిక్కనూరుకు చెందిన రిశ్విత సాధించిన ఈ అద్భుత విజయం తెలంగాణ యువతకు, ముఖ్యంగా క్రీడాకారులకు ఎంతో స్ఫూర్తిదాయకమని ఆయన అన్నారు. పట్టుదల, కృషి, ప్రతిభతో అంతర్జాతీయ స్థాయిలో విజయాలు సాధించవచ్చని రిశ్విత నిరూపించిందని పేర్కొన్నారు.
రిశ్విత భవిష్యత్తులో మరెన్నో అంతర్జాతీయ విజయాలు సాధించి దేశానికి మరింత పేరు ప్రతిష్టలు తీసుకురావాలని షబ్బీర్ అలీ మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. ఆమె క్రీడా ప్రస్థానంలో అవసరమైన ప్రోత్సాహం, సహకారం అందించేందుకు తాను ఎల్లప్పుడూ ముందుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఐరేనీ సందీప్ కుమార్, సుదర్శన్, గోనె శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






