16 August, 2026 | 8:32 PM

ప్రజావాణిలో మైనారిటీలు భాగస్వాములు కావాలి

16-08-2026 06:04 PM

మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు యాకూబ్ పాషా 

కొత్తగూడెం టౌన్, (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల్లోని ఎంపీడీఓ కార్యాలయాల్లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో మైనారిటీలు పెద్ద సంఖ్యలో భాగస్వాములై తమ సమస్యలపై వినతిపత్రాలు సమర్పించాలని మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎండీ.యాకూబ్ పాషా పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

ప్రతి మండలంలో మైనారిటీలకు స్మశాన వాటికలు, ఈద్గా ప్రార్థనా స్థలాలకు అవసరమైన స్థలాలను కేటాయించేలా అధికారులకు వినతిపత్రాలు అందించాలని సూచించారు. అలాగే మండలాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో ఆక్రమణలకు గురైన వక్ఫ్ భూములను గుర్తించి, వాటిని రక్షించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరాలని తెలిపారు. అదేవిధంగా స్థానికంగా మైనారిటీలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ప్రజావాణి కార్యక్రమం ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ఎండీ. యాకూబ్ పాషా కోరారు. ప్రజావాణిని సమస్యల పరిష్కారానికి ఉపయోగించుకోవాలని, మైనారిటీలు చురుగ్గా పాల్గొని తమ హక్కులు, అవసరాలపై ప్రభుత్వానికి వినతులు సమర్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.