లక్ష్యాలను తప్పనిసరిగా సాధించాలి
- డీఎంహెచ్‌ఓ డాక్టర్ కే. కృష్ణ
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): జిల్లాలో అమలవుతున్న అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాల్లో నిర్దేశించిన లక్ష్యాలను తప్పనిసరిగా సాధించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) డాక్టర్ కే. కృష్ణ వైద్యాధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులతో జాతీయ ఆరోగ్య కార్యక్రమాల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ప్రతి గర్భిణిని 12 వారాల లోపే నమోదు చేసి, రక్తహీనత నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
ప్రసవానికి ముందు ప్రతి గర్భిణికి కనీసం 11 గ్రాముల హిమోగ్లోబిన్ ఉండేలా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాల సంఖ్యను పెంచేందుకు కృషి చేయాలని తెలిపారు. 14 ఏళ్ల బాలికలందరికీ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణ కోసం హెచ్‌పీవీ టీకా వంద శాతం పూర్తి చేయాలని, ఇందుకోసం పాఠశాలల్లో తల్లిదండ్రులకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. 30 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికి అధిక రక్తపోటు, మధుమేహం వంటి అసాంక్రమిక వ్యాధుల స్క్రీనింగ్ పరీక్షలను ఆగస్టు నెలాఖరులోపు పూర్తి చేయాలని, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
వర్షాకాలంలో అంటువ్యాధుల నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, ముఖ్యంగా రెసిడెన్షియల్ పాఠశాలల్లో వైద్య శిబిరాలు నిర్వహించి విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేసి అవసరమైన మందులు అందించాలని డీఎంహెచ్‌ఓ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ప్రోగ్రాం అధికారులు డాక్టర్ కృష్ణమోహన్, డాక్టర్ సురేష్‌బాబు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ భీమానాయక్, డాక్టర్ తారాసింగ్, డీపీఓ రేనయ్య, ఎపిడీమియాలజిస్ట్ ప్రవల్లిక, ఏపీవోలు బాలస్వామి, విజయ్‌కుమార్, కోట్ర నిరంజన్, శివకుమార్, డీడీఎంలు సందీప్‌కుమార్, నవీన్‌తో పాటు వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.






