15 April, 2026 | 5:17 AM

రేవంత్‌రెడ్డి.. యాంటీ అంబేద్కర్

15-04-2026 12:40 AM
  1. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అంబేద్కర్ భిక్షే
  2. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3తోనే తెలంగాణ సాధ్యమైంది
  3. ప్రత్యేక రాష్ట్రం వచ్చి 12 ఏళ్లు గడిచినా ఎలాంటి పురోగతి లేదు
  4. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

హైదరాబాద్, ఏప్రిల్ 14 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి యాంటీ అంబే ద్కర్ అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఈ భూమి మీద ఎవరైనా అంబేద్కర్ వ్యతిరేకి ఉన్నారంటే అది రేవంత్‌రెడ్డి మాత్రమేనని పేర్కొ న్నారు. ది యునైటెడ్ ఫోరం ఫర్ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన జయంతి వేడుకల్లో కవిత పాల్గొని నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాబా సాహెబ్ జయంతి సందర్భంగానైనా ఈ ముఖ్యమంత్రికి బుద్ధి వచ్చి పేదలకు న్యాయం చేసే పరిస్థితి రావాలని ఆకాంక్షించారు. అంబేద్కర్ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక ఐడియాలజీ, ఒక థాట్ అని చెప్పారు. మహిళలు అభివృద్ధి చెందితేనే ఆ సమాజం అభివృద్ధి చెందుతుందని భావించిన బాబా సాహెబ్ మహిళల కోసం ఎంతో చేశారని గుర్తుచేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందంటే అది అంబేద్కర్ పెట్టిన భిక్ష అని గుర్తుచేశారు.

రాజ్యాంగంలో ఆర్టికల్ 3 అనే శక్తి లేకపోయి ఉంటే తెలంగాణ ఏర్పాటు అనేది సాధ్యమయ్యేదే కాదని అన్నారు. సోషలిజం వర్ధిల్లాలని అంబేద్కర్ కాంక్షించే వారని, దురదృష్టవశాత్తు తెలంగాణలో ఆ పరిస్థితి లేకుండా పోయిందన్నారు. రాష్ట్రం సాధించుకుని 12 ఏళ్లు గడుస్తున్నప్పటికీ దళితులు, మహిళలపై ఇంకా ఆకృత్యా లు పెరిగిపోవటం ఆందోళన కలిగిస్తుందన్నారు. రాష్ట్రంలో ఏ ప్రాజెక్ట్ కట్టినా సరే దళితులకు చెందిన అసైన్డ్ భూములనే ప్రభుత్వాలు లాక్కుంటున్నాయని పేర్కొన్నారు.

వెలుగుమట్లలో అదే చేశారని, ఇప్పుడు పరిగిలో కూడా 1200 ఎకరాలు సేకరిస్తే అందులో వెయ్యి ఎకరాలు అసైన్డ్ భూములేనని ఆవేదన వ్యక్తంచేశారు. బాబా సాహెబ్ అంటేనే ధైర్యమని, ఆయన ఇచ్చిన ధైర్యంతో పేదల పక్షాన ఈ ప్రభుత్వంపై పోరాటం చేస్తామనిచెప్పారు. అంబేద్కర్ స్ఫూర్తితో రాష్ట్రంలో మరిన్ని ఉద్యమాలు వచ్చి ప్రజల కష్టాలన్నీ తొలగిపోవాలని ఆకాంక్షించారు. నల్లమలలోని సహజ సంపదను కొల్లగొట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెంచులను బలి చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు.

నాగర్‌కర్నూల్ జిల్లా ఆమ్రాబాద్ మండలం కడిచింతలపైలు, సార్లపల్లి చెంచు పెంటల్లో 200లకు పైగా చెంచు కుటుంబాలను బలవంతంగా తరలించేందుకు ఒత్తిడి చేస్తున్నారన్నారు. అడవి వదిలి వెళ్లేది లేదని చెంచులు చెప్తున్నప్పటికీ పునరావాస ప్యాకేజీ పేరుతో వారిని పంపించే ప్రయత్నం చేస్తుండటం సరికాదన్నారు.

చెంచులను అడవికి దూరం చేసే ప్రయత్నాలు మానుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. స్థానికంగానే ఆదివాసీలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునే అవకాశం ఉన్నా సరే నల్లమల నుంచి ఎందుకు పంపించే కుట్ర చేస్తున్నారో చెప్పాలని నిలదీశారు. నోరు లేని అడవి బిడ్డలకు అక్కడే ఉండే అవకాశం ఇవ్వాలని డిమాండ్‌చేశారు. లేదంటే అడవి బిడ్డల తరఫున జాగృతి పోరాటం చేస్తుందని హెచ్చరించారు.