ఏపీతో రేవంత్ మిలాఖత్
- ‘పోలవరం--బనకచర్ల లింక్’కు సహకారం
- రేవంత్‌రెడ్డి ద్రోహన్ని తెలంగాణ సమాజం క్షమించదు
- తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, జూలై 13 (విజయక్రాంతి): ఏపీతో రేవంత్‌రెడ్డి మిలాఖత్ అయ్యి, గోదావరిలో తెలంగాణ నీటి హక్కులను కాలరాస్తున్నారని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు తెరచాటుగా ఏపీకి రేవంత్‌రెడ్డి సహకరిస్తున్నారని మండిపడ్డారు. ఈ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్‌లో లోపాలున్నాయని సుప్రీంకోర్టు పేర్కొన్న నేపథ్యం లో కవిత ట్విట్టర్ వేదికగా స్పందించారు.
రేవంత్‌రెడ్డి చేస్తున్న ఈ ద్రోహాన్ని తెలంగాణ సమాజం క్షమించదని పేర్కొన్నారు. ఏపీ అక్రమ ప్రాజెక్టుపై తెలంగాణ దాఖలు చేసిన పిటిషన్‌లో లోపాలు ఉన్నాయని చెప్తూ ఏపీ ప్రభుత్వానికి కనీసం నోటీసులు ఇవ్వటానికి సుప్రీంకోర్టు నిరాకరించిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి సున్నం పెట్టి.. ఏపీ సీఎం చంద్రబాబుకు గురుదక్షిణగా గోదావరి నీళ్లను రేవంత్‌రెడ్డి కట్టబెడుతున్నారని మండిపడ్డారు.
బనకచర్ల విషయంలో ఏపీకి రేవంత్ ఎంత గా సహకరిస్తున్నాడో ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను బట్టి అర్థం చేసుకోవచ్చని తెలిపారు. ఈ సీఎంకు నీళ్ల సోయి లేకపోవడం తెలంగాణకు శాపంగా మారిందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీతో ముఖ్యమంత్రి రేవంత్ మిలాఖత్ రాజకీయాలు మాని తెలంగాణ హక్కుల కోసం పనిచేయాలని సూచించారు. లింక్ ప్రాజెక్టుపై పటిష్టమైన పిటిషన్‌ను సుప్రీంకోర్టులో దాఖలు చేయాలని డిమాండ్ చేశారు. ఆ ప్రాజెక్టును అడ్డుకోకపోతే తెలంగాణకు శాశ్వతంగా అన్యాయం చేసిన వారవుతారని హెచ్చరించారు.






